మిషన్‌ భగీరథకే శ్రీశైలం నిల్వలు 

11 May, 2019 02:36 IST|Sakshi

ఏపీ ఇండెంట్‌పై కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

సాగర్‌లో రోజుకు 700 క్యూసెక్కులు ఆవిరి

ఇటు తెలంగాణ వాటాపోనూ నిల్వలుండవని వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ నుంచి మూడు టీఎంసీలు కావాలంటూ ఆంధ్రప్రదేశ్‌ సమర్పించిన ఇండెంట్‌పై తెలంగాణ నీటిపారుదల శాఖ కృష్ణా బోర్డుకు స్పష్టతనిచ్చింది.  ఈ మేరకు ఈఎన్‌సీ మురళీధర్‌రావు కృష్ణాబోర్డుకు శుక్రవారం లేఖ రాశారు.  తెలంగాణ వాటా పోనూ మిగిలిన 4.60 టీఎంసీల్లో గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు మూడు టీఎంసీలు కావాలని ఆ రాష్ట్ర ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు బోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ బోర్డు తెలంగాణకు లేఖ రాసింది.  

మిషన్‌ భగీరథకు నీరందదు..  
ఈ ఏడాది మార్చిలో బోర్డు నీటి విడుదల ఉత్తర్వులిస్తూ తెలంగాణకు 29 టీఎంసీలు, ఏపీకి 17.50 టీఎంసీలు కేటాయించిందని మురళీధర్‌రావు పేర్కొన్నారు. ఇందులో ఏపీ తన వాటాకు మించి నీటిని వాడుకోగా... తెలంగాణ ఇంకా 10.713 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందని తెలిపారు. అయితే శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 805 అడుగుల నీటిమట్టం ఉందని, 1.582 టీఎంసీలు మాత్రమే ఉన్నందున ఈ నిల్వల్ని తెలంగాణ తాగునీటి అవసరాలకు నెలకు 0.50 టీఎంసీలు వాడుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నుంచి చుక్క నీటిని కూడా సాగర్‌కు విడుదల చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. పైగా శ్రీశైలంలో రోజుకు వంద క్యూసెక్కుల చొప్పున ఆవిరవుతోందని అంచనా వేశారు.  

సాగర్‌లోనూ అదే విషమ పరిస్థితి 
నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 510 అడుగుల నీటి మట్టం ఉండగా.. 505 అడుగుల ఎగువన 10.383 టీఎంసీల నిల్వలు ఉన్నాయన్నారు. అయితే, రోజుకు సాగర్‌ జలాశయంలో 700 క్యూసెక్కుల చొప్పున నీరు ఆవిరి అవుతోందని, మే నెలలోనే ఈ నష్టం 1.50 టీఎంసీలుగా ఉంటుందన్నారు. హైదరాబాద్, ఇతర జిల్లాల తాగునీటి అవసరాలు కూడా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి నీళ్లివ్వడం సాధ్యం కాదని స్పష్టంచేశారు.   

మరిన్ని వార్తలు