ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

17 Sep, 2017 01:59 IST|Sakshi
ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

శ్రీశైలం జలాశయంలోకి కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్‌:
వర్షాకాలం ప్రారంభమైన మూడున్నర నెలల తర్వాత కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తుంగభద్ర జలాశయం దిగువన కురిసిన వర్షాలకు తుంగభద్ర ఉప్పొంగడంతో శుక్రవారం రాత్రి సుంకేసుల బ్యారేజీ నిండింది. దీంతో శనివారం 1.20లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి వరద నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు 61,849 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

తుంగభద్ర వరదకు కృష్ణా జలాలు తోడవడంతో శ్రీశైలం జలాశయంలోకి 1,88,383 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది. తొలిసారిగా భారీ వరద రావడంతో జలాశయంలో శనివారం సాయంత్రానికి నీటి నిల్వ 61.80 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయిలో నిండాలంటే మరో 154 టీఎంసీలు అవసరం. మరోవైపు నాగార్జున సాగర్‌లో 500.9 అడుగుల వద్ద ప్రస్తుతం 116.73 టీఎంసీల నీటి నిల్వ ఉండగా నాగార్జున సాగర్‌ నిండాలంటే 195.31 టీఎంసీలు అవసరం. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 7.22 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మరో 38.55 టీఎంసీలు వస్తే పులిచింతల ప్రాజెక్టు నిండుతుంది. వెరసి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు పూర్తిగా నిండాలంటే 387.86 టీఎంసీలు అవసరం.

మరిన్ని వార్తలు