ఎస్సారెస్పీకి పొంచి ఉన్న ముప్పు!

10 Sep, 2019 11:07 IST|Sakshi
ఎస్సారెస్పీలో ఇసుకను తవ్వుతున్న కూలీలు

ఆనకట్ట చెంత ఇసుకను తోడేస్తున్నారు

పగలు కుప్పలు చేసి.. రాత్రికి రవాణా

పట్టించుకోని ప్రాజెక్ట్‌ అధికారులు

ఆనకట్టకు ప్రమాద హెచ్చరికలు!

సాక్షి, బాల్కొండ (కామారెడ్డి): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను కూడా ఇసుక అక్రమ వ్యాపారులు వదలడం లేదు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ ఆనకట్ట లోపలి వైపు నుంచి ఇసుకను తవ్వేస్తున్నారు. ఆనకట్ట రివిట్‌మెంట్‌ బండరాళ్ల మధ్యలో నుంచి ఇసుకను తవ్వి కుప్పలు వేస్తున్నారు. పగలు కుప్పలు చేసి రాత్రివేళల్లో ఇసుకను తరలించి దందాను కొనసాగిస్తున్నారు. నెల రోజుల క్రితం వరకు ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రాకపోవడంతో పెద్ద ఎత్తున ఇసుక దందాను కొనసాగించారు. ఆ సమయంలో ప్రాజెక్ట్‌ అధికారులు హల్‌చల్‌ చేశారు. అయితే మళ్లీ షరా మామూలుగానే ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. ప్రాజెక్ట్‌లోకి ఇసుకను తవ్వి ఆనకట్టపై కుప్పలు కుప్పలుగా వేసినా అధికారులు పట్టించుకోవడంలేదు. కనీసం ఇసుక ఎవరిది అని కూడా ఇప్పటి వరకు గుర్తించలేదు. మళ్లీ ఇసుక దందా ఆగకుండా సాగుతూనే ఉంది.

స్పందించని ఉన్నతాధికారులు.. 
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదల కారణంగా నీరు ఆనకట్ట వద్ద అలలుగా తాకుతుంటాయి. దీంతో ప్రాజెక్ట్‌లోని మట్టి కొట్టుకు వచ్చి ఇసుక మేటలుగా పెడుతుంటుంది. అంతేకాకుండా ఆనకట్ట బలోపేతానికి ఇసుకతో రివిట్‌మెంట్‌ చేపట్టారు. ప్రస్తుతం ఆ రివిట్‌మెంట్‌లో ఇసుకను, ఆనకట్టకు ఆనుకుని ఇసుక తవ్వకాలు చేపట్టడం ఆనకట్టకు ప్రమాదకరంగా పలువురు పేర్కొంటున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా ప్రాజెక్ట్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. రివిట్‌మెంట్‌ కుంగి ఆనకట్టకు గండి ఏర్పడే ప్రమాదం ఉంది. ఇసుక తవ్వకం నిలిపి వేయకుంటే ప్రాజెక్ట్‌లో భారీ వరదలు వచ్చి అలలు తాకితే ఆనకట్ట కుంగి గండి ఏర్పడే అవకాశం ఉంది. ప్రాజెక్ట్‌ రక్షణ కోసం డివిజన్‌–2 విభాగంలో సబ్‌ డివిజన్‌–1 విభాగం ఉంది. అయితే సిబ్బంది లేక పోవడంతో అధికారులు చేతులెత్తేశారు. దీంతో ఇసుక మాఫియా ఎగబడుతోంది. ఆనకట్టకు ప్రమాదం సంభవించక ముందే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు