యాసంగి పంటలకు నిలిచిన నీటి విడుదల

11 Apr, 2019 18:09 IST|Sakshi
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ 

బాల్కొండ:  శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి ప్రస్తుత సంవత్సరం యాసంగి పంటలకు అన్ని కాలువల ద్వారా నీటి విడుదలను ప్రాజెక్ట్‌ అధికారులు నిలిపివేశారు. ఎస్సారెస్పీ నుంచి ప్రస్తుత యాసంగి సీజన్‌లో కాకతీయ కాలువ ద్వారా, లక్ష్మి, సరస్వతి కాలువల ద్వారా నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.. ప్రాజెక్ట్‌ నుంచి జనవరి 15 నుంచి నీటి విడుదల చేపట్టి మార్చి 31 న పూర్తి చేయాలని మొదట ప్రణాళిక రూపొందించారు. కానీ చివరికి నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్ట్‌ నుంచి ఫిబ్రవరి 1 నుంచి వారబందీ ప్రకారం నీటి విడుదల చేపట్టారు. నాలుగు విడతలు అందించారు.  

19.5 టీఎంసీల నీటి వినియోగం 
ప్రాజెక్ట్‌ నుంచి యాసంగి పంటల కోసం అన్ని కాలువలతోపాటు, తాగు నీటి అవసరాల కోసం 19.5 టీఎంసీల నీటిని వినియోగించినట్లు అధికారులు చెబుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 14.5 టీఎంసీలు, సరస్వతి కాలువ ద్వారా 1.41 టీఎంసీలు, లక్ష్మి కాలువ ద్వారా 1.31 టీఎంసీలు, అలీసాగర్‌ గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా 1.98 టీఎంసీల నీటిని విడుదల చేశామని, తాగు నీటి పథకాల కోసం 0.79 టీఎంసీల నీటిని అందించామని అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 1.18 టీఎంసీల నీరు వృథా అయ్యిందంటున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091(90 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1,053.30(8.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు