చిట్యాల సొసైటీలో సిబ్బంది చేతివాటం

10 Apr, 2014 04:31 IST|Sakshi
చిట్యాల సొసైటీ భవనం

చిట్యాల, న్యూస్‌లైన్ : నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు.. అన్న చందంగా వ్యవహరిస్తున్నారు చిట్యాల సొసైటీ ఉద్యోగులు. పంటల సాగుకోసం నిరుపేద రైతులకు అందించాల్సిన రుణాలు, మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన డబ్బును వారు పక్కదారి పట్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వం ఏటా మంజూరు చేస్తున్న స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు దుర్వినియోగమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. చిట్యాల సొసైటీలో పనిచేస్తున్న కార్యనిర్వాహక కార్యదర్శి మొగిలి, అటెండర్ రామనాథంలు ఈ ఏడాది మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన రూ. 3 లక్షలను స్వాహా చేశారు.


 అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా నిధులు దుర్వినియోగం చేసినందుకు పాలకవర్గం వారికి మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ పెడచెవిన పెట్టారు. ఈ క్రమంలో సొసైటీ చైర్మన్ కర్రె అశోక్‌రెడ్డి, వైస్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ సమక్షంలో డెరైక్టర్లందరూ బుధవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన డబ్బులు రూ.3 లక్షలను కాజేసిన కార్యనిర్వాహక కార్యదర్శి, అటెండర్‌ను విధుల నుంచి  తొలగించాలని తీర్మానం చేసి డీసీసీబీ అధికారులకు పంపించడం గమనార్హం.

 కొనసాగుతున్న సస్పెన్షన్లు..

 చిట్యాల సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులు అవినీతి కూపంలో మునిగి తేలుతున్నారు. రైతుల సంక్షేమానికి పాటుపడాల్సిన ఉద్యోగు లు అక్రమాల పరంపరను కొనసాగిస్తున్నారు. బినామీ రైతులను సృష్టించి గతంలో రూ. 14 లక్షల పంట రుణాలు తీసుకున్నందుకు సీఈఓ లింగమూర్తితోపాటు సిబ్బంది మొగిలి, రాజేం దర్, రామనాథం, రాజిరెడ్డిని జిల్లా అధికారు లు సస్పెండ్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి రూ. 14 లక్షలను రికవరీ చేశారు. ఇది లా ఉండగా, ఎరువు బస్తాల కోసం రైతుల నుంచి తీసుకున్న అడ్వాన్స్‌ను ఉద్యోగులు ఇంతవరకు వారికి బస్తాలు ఇవ్వలేదు.

ఈ విషయంలో ఇద్దరు అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. కాగా, సొసైటీ పరిధిలో లేని 26 మంది రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు చెల్లించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా రుణాలు చెల్లించినప్పటికీ వారి వద్ద నుంచి డబ్బులు రికవరీ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన రూ.3 లక్షలను సీఈఓ మొగిలి, సబ్‌స్టాఫ్ రామనాథం స్వాహా చేయడం సొసైటీలో కలకలం రేపింది.

 డిఫాల్ట్ సంఘంగా గుర్తింపు..

 చిట్యాల సొసైటీ.. జిల్లా సహకార సంఘంలో డిఫాల్ట్‌గా గుర్తింపు పొంది సభ్యత్వాన్ని కోల్పోయింది. సొసైటీ పరిధిలో రూ. 4 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో డీసీసీబీ చైర్మన్ ఎన్నికకు సొసైటీ చైర్మన్ ఓటు వేసే అర్హతను కూడా కోల్పోయారు. దీంతోపాటు రైతులకు ఇచ్చిన పంట రుణాలను వసూలు చేయడంలో ఈ సొసైటీ జిల్లాలో వెనకబడిపోయింది. ఈ విషయమై చైర్మన్ కర్రె అశోక్‌రెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా సొసైటీ అధికారుల పనితీరు అధ్వానంగా ఉందన్నారు. రైతులకు ఇచ్చిన పంట రుణాలను సిబ్బంది సక్రమంగా వసూలు చేయడం లేదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు