అడవుల పునరుజ్జీవానికి ప్రాధాన్యత

19 May, 2019 03:15 IST|Sakshi

వాటర్‌హోల్స్‌ సర్వేలో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలు అందజేత

అరణ్యభవన్‌లో సర్వే సిబ్బందితో అటవీ అధికారుల భేటీ

సాక్షి, హైదరాబాద్‌: అడవుల పునరుజ్జీవనం, వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. కవ్వాల్, అమ్రాబాద్, ఏటూరునాగారం రక్షిత అటవీ ప్రాంతాల్లో నీటి సౌకర్యాల లభ్యత (వాటర్‌హోల్స్‌), జంతువుల సంచారంపై ఈనెల 11, 12 తేదీల్లో చేసిన సర్వే సిబ్బందితో శనివారం అరణ్యభవన్‌లో పీసీసీఎఫ్‌లు ఎం. పృథ్వీరాజ్, ఆర్‌. శోభ, అదనపు పీసీసీఎఫ్‌ మునీంద్ర, ఓఎస్డీ శంకరన్‌ భేటీ అయ్యారు. వేసవిలో అడవుల్లో జంతు సంరక్షణకు చేసిన ఏర్పాట్లపై సమీక్ష, వాలంటీర్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్వేలో పాల్గొన్న సిబ్బందికి అటవీ శాఖ తరపున ప్రశంసా పత్రాలను అందజేశారు.

సహజ నీటి కుంటలతో పాటు, కృత్రిమంగా ఏర్పాటు చేసిన సాసర్‌పిట్లు వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నాయని వాలంటీర్లు పేర్కొన్నారు. కొన్నిచోట్ల గేదెల పెంపకం, ఆక్రమణలు, మానవ సంచారం ఎక్కువగా ఉన్నదని, వీటి కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అడవుల్లో అక్రమాలు, వేట, స్మగ్లింగ్‌ చేసేవారి సమాచారం ఇచ్చే వ్యవస్థను పటిష్టం చేయాలని, స్థానికులు, విద్యార్థులను భాగస్వామ్యం చేయాలన్నారు. దాదాపు కనుమరుగైన కొన్ని జంతువులు (పులులు, అడవి దున్నలు, ఇతర జంతువులు)ఇప్పుడు మంచి సంఖ్యలో పెరిగాయని, అడవులు వన్యప్రాణుల రక్షణ చర్యలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు