ఎలా అడ్డుకట్టు?

2 Aug, 2019 11:37 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో సిబ్బంది కొరత  

452 మందికి 124 మందే...  

పెరిగిపోతున్నఅక్రమ నిర్మాణాలు  

ఆగని చెరువుల కబ్జాలు  

నత్తనడకన భూసేకరణ  

ప్రాజెక్టుల పనుల్లో జాప్యం  

సిబ్బంది కొరతతో అవినీతికి పాల్పడినా చర్యలు తీసుకోని వైనం  

కొరత ఇలా.. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం సహా జోన్లు, సర్కిళ్లలో పని చేసేందుకు 60 మంది బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు అవసరం కాగా... 21 మంది మాత్రమే ఉన్నారు. సర్కిల్‌ ఒకరు చొప్పున కనీసం 30 మంది సర్వేయర్లు అవసరం కాగా.. అసలే లేరు. టీపీఓ/టీపీఏలు 224 మంది కావాల్సి ఉండగా... 34 మంది మాత్రమే ఉన్నారు. డ్రాఫ్ట్స్‌మెన్‌ 47 మందికి గాను 22 మంది.. ఏసీపీలు 52 మందికి గాను 33 మంది.. డీసీపీలు 30 మందికి గాను 12 మంది.. సీపీలు ఐదుగురికి గాను ఒక్కరు, అడిషనల్‌ సీపీలు నలుగురికి గాను ఒక్కరు మాత్రమే ఉన్నారు.

సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. వీటిలో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మిస్తున్న భవనాలతో పాటు రెండంతస్తుల వరకే పర్మిషన్‌ తీసుకొని, అదనంగా మరిన్ని అంతస్తులు నిర్మిస్తున్న భవనాలు ఉన్నాయి. ఇక చెరువులనూ కబ్జా చేస్తూ కట్టేస్తున్న భవనాలూ ఉన్నాయి. వీటిని ఆపాల్సిందెవరు?  
వర్షాకాలం వచ్చిందంటే చాలు నగరవాసుల్లో భయాందోళన మొదలవుతుంది. ఏ శిథిల భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. శిథిల భవనాలను గుర్తించి, వాటిల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించి.. ఆయా భవనాలను కూల్చివేయాల్సి ఉంది. లేని పక్షంలో తగిన మరమ్మతులు చేసి శిథిల భవనాలను పటిష్టం చేయాలి. మరి ఈ పనులు చేసేదెవరు?  
నగరంలో ఈ ఏడాది పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఫ్లైఓవర్లు, ఆర్‌ఓబీలు తదితర పనులు ఉన్నాయి. ఇంకా నాలాల విస్తరణ జరగాల్సి ఉంది. ఇవి పూర్తి కావాలంటే ఎన్నో భూములు సేకరించాల్సి ఉంది. ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థల నుంచి ఈ భూములను సేకరించాలి. మరి ఇందుకు భూములను సేకరించాల్సిందెవరు?  

పైవన్నీ జీహెచ్‌ఎంసీలోని టౌన్‌ప్లానింగ్‌ విభాగం బాధ్యతలు. ఇవే కాకుండా భవన నిర్మాణాలకు అనుమతుల జారీ, పట్టణ ప్రణాళికకు సంబంధించిన అంశాలు తదితర  ఈ విభాగం చేయాల్సిన పనులే. ఇక ప్రతివారం నిర్వహించే ‘ప్రజావాణి’కి అందే ఫిర్యాదుల్లో 80శాతం ఈ విభాగానివే. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు నేరుగా అందే ఫిర్యాదుల్లోనూ సింహభాగం దీనివే. ఇలా ఎన్నో బాధ్యతలున్న టౌన్‌ప్లానింగ్‌ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరముందని, అందుకోసం సిబ్బందిని పెంచాలని జీహెచ్‌ఎంసీ స్టాఫింగ్‌ ప్యాట్రన్‌పై రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రసాదరావు నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోనే చేసిన ఈ సిఫార్సులకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ జోన్లు ఆరుకు, సర్కిళ్లు 30కి పెరిగినప్పటికీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో సిబ్బంది మాత్రం పెరగలేదు. 18 సర్కిళ్లుగా ఉన్నప్పుడున్న సిబ్బందితోనే ఇప్పటికీ నెట్టుకొస్తున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీలో అవినీతి జరిగే విభాగాల్లోనూ ఇదే ముందు వరుసలో ఉంటోంది. కానీ అవినీతి అక్రమాలు వెలుగు చూసినా ఎవరిపై చర్యలు ఉండవు. అందుకు కారణం ఈ విభాగంలో అధికారులు, సిబ్బంది కొరతే. అసలే అరకొర సిబ్బంది.. ఇక వారిపైనా చర్యలు తీసుకుంటే పనుల్లో మరింత జాప్యమవుతుందని ఉన్నతాధికారులు ఊర్కుంటున్నారు.  

మూడో వంతు మాత్రమే...  
కమిటీ సిఫార్సుల మేరకు జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల్లో 2,607 మంది అవసరం. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో 452 మంది పనిచేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 124 మందే ఉన్నారు. అంటే మూడో వంతు మాత్రమే. దీంతో అన్ని పనుల్లోనూ జాప్యం జరుగుతోంది. పనులతో పాటు కోర్టు కేసులు ఎక్కువగా ఉండేదీ ఈ విభాగానికే . దానివల్ల అధికారుల సమయం హరించుకుపోతోంది. అనుమతులు, ఓసీల జారీ తదితర ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవడంతో కొంత వెసులుబాటు కలిగినప్పటికీ... ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన పత్రాలన్నీ సవ్యంగా ఉన్నదీ? లేనిదీ? పరిశీలించేందుకు తగిన సమయం కావాలి. ఇలా వివిధ కారణాలతో అక్రమ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోలేకపోతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో నగరంలో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడడం లేదు. 

నియామకాల్లో జాప్యం  
టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి 400 మందికి పైగా కావాల్సి ఉన్నప్పటికీ... 200 పోస్టుల భర్తీకి మాత్రమే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ మేరకు టీఎస్‌పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ వెలుడినప్పటికీ నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. జోన్ల విభజన, గతేడాది ఎన్నికలతో కోడ్‌ అమల్లో ఉండడం తదితర కారణాలతో ఈ పోస్టులు భర్తీ కాలేదు. కమిటీ సిఫార్సుల నాటికి, ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా శివార్లలో ఇళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. బహుళ అంతస్తుల భవనాల దరఖాస్తులూ పెరుగుతున్నాయి. అయినా సిబ్బంది మాత్రం పెరగకపోవడంతో తిప్పలు తప్పడం లేదు.

మరిన్ని వార్తలు