ఇందూరంటే లోకువా!

1 Jul, 2019 10:40 IST|Sakshi
ప్రభుత్వ వైద్య కళాశాల

వైద్య కళాశాలలో ఏడేళ్లుగా భర్తీ కాని పోస్టులు

సూర్యాపేట, నల్లగొండ కాలేజీల్లో వేగంగా భర్తీ

మెడికల్‌ కాలేజీ దుస్థితిని పట్టించుకోని నేతలు

805 పోస్టులుంటే ఉన్నది 171 మందే

సాక్షి, నిజామాబాద్‌ అర్బన్‌: ఇందూరు జిల్లా అంటే లోకువనో ఏమో కానీ.. కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో ఇటు సర్కారు, అటు ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లా ఆస్పత్రితో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల దుస్థితిపై స్పందించడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోవడం లేదు. ఫలితంగా వైద్య కళాశాలలో ఏడేళ్లుగా పోస్టులు భర్తీ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాల కంటే ఏడాది క్రితం ప్రారంభమైన నల్లగొండ, సూర్యపేట వైద్య కళాశాలలకు ప్రభుత్వం ఇటీవల పోస్టులు మంజూరు చేసింది. అంతేకాదు తక్షణమే ఆయా పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించింది. ప్రత్యేక మెడికల్‌ పోస్టుల ద్వారా ఆయా పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, నిజామాబాద్‌ వైద్య కళాశాలకు ఏడేళ్ల క్రితం మంజూరైన పోస్టుల భర్తీని మాత్రం మరిచి పోయింది.

సిబ్బంది కొరత.. 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిజామాబాద్‌కు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను మంజూరు చేశారు. 2008లో జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించి, తక్షణమే అమలయ్యేలా చూశారు. జీవో 150 ద్వారా కళాశాలకు 2012లో కొత్త పోస్టులను మంజూరు చేశారు. ఇందులో బోధన, బోధనేతర, పరిపాలన అధికారులు, సిబ్బంది పోస్టులున్నాయి. 150 జీవో ప్రకారం ప్రభుత్వ పరిపాలన విభాగంలో 189, ప్రిన్సిపల్‌ విభాగంలో 50 పోస్టులు మంజూరయ్యాయి. ఈ రెండు విభాగాలకు సంబంధించి ప్రస్తుతం 11 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇక, సూపరింటెండెంట్‌ విభాగంలో 15 పోస్టులకు గాను 9 మంది పని చేస్తుండగా, ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

క్లినికల్‌ విభాగంలో 87 పోస్టులు మొత్తం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విద్య బోధనకు సంబంధించి అన్ని రకాల ప్రొఫెసర్లు కలిపి 311 మంది ఉండాల్సి ఉండగా, 162 మంది మాత్రమే పని చేస్తున్నారు. 149 ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 805 పోస్టులకు గాను 171 మంది పని చేస్తున్నరు.ఇక, ఆస్పత్రిలో వివిధ విభాగాలకు సంబంధించి 410 పోస్టులకు గాను 211 మంది పని చేస్తున్నారు. ఇందులోనూ కొందరిని డిప్యూటేషన్‌ పద్ధతిలో ఇక్కడ నియమించారు.

ఎంసీఐ అనుమతి కోసం తంటాలు.. 
ప్రతి ఏటా ఎంసీఐ అనుమతి కోసం అధికారులు అనేక తంటాలు పడుతున్నారు. ఎంసీఐ పరిశీలనకు వస్తుందంటే అధికారులు ఆందోళన చెందుతున్నారు. కళాశాల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి ఉద్యోగులను చూపించాల్సి ఉంటుంది. దీంతో డిప్యూటేషన్‌పై సిబ్బందిని ఇక్కడ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎంసీఐ అనుమతి పొందడంలో రెండుసార్లు విఫలమయ్యారు. అయినప్పటికీ పోస్టుల భర్తీకి సంబంధించి మాత్రం చర్యలు చేపట్ట లేదు. కాంట్రాక్ట్, తాత్కాలిక పద్ధతిలోనూ భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు అనుమతించడం లేదు. జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పడినప్పటి నుంచి ఓపీ రోగుల సంఖ్య రెండింతలు పెరిగింది. నిత్యం 1500 మందికి పైగా రోగులకు ఇక్కడ వైద్యం అందిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మరిన్ని వార్తలు