సిబ్బంది కావలెను!

21 Dec, 2018 10:14 IST|Sakshi

హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగంలో భారీగా ఖాళీలు

124 పోస్టులకు పనిచేస్తున్నది కేవలం 35 మందే..

ఖాళీల భర్తీపై ప్రభుత్వ కాలాయాపన

ఉన్న సిబ్బందిపై అదనపు భారంతో పనుల్లో భారం

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు భారీ ఆదాయం సమకూర్చే ప్లానింగ్‌ విభాగంలో కుర్చీలు ఖాళీ అవుతున్నాయి. నగర శివారు ప్రాంతాలను అభివృద్ధి పుంతలు తొక్కించే లేఅవుట్లు, బిల్డింగ్‌ పర్మిషన్లకు అనుమతిలిచ్చే ఈ అధికారుల సంఖ్య నెలలుతిరక్కుండానే తగ్గుతుండటంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతోంది. హెచ్‌ఎండీఏకు ప్రభుత్వం నుంచి 2003లో మంజూరు ఉన్న 124 పోస్టులకు ప్రస్తుతం పనిచేస్తుంది 35 మంది మాత్రమే ఉండటం వల్ల పని ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో ఆ అంకెలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ 35 మందిలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) నుంచి పదోన్నతిపై వచ్చినవారు 11 మంది ఉండగా, హెచ్‌ఎండీఏకు చెందినవారు 24 మంది ప్లానింగ్‌ ఆఫీసర్, అడిషనల్‌ ప్లానింగ్‌ ఆఫీసర్, జూనియర్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ హోదాల్లో కొనసాగుతున్నారు. వీరిలో హెచ్‌ంఎడీఏకు చెందిన మరో ఏడుగురు ఉద్యోగులు మరికొన్ని నెలల్లో పదవీ విరమణ చేయనుండటంతో ప్లానింగ్‌లో మరిన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. ఇలా అనుభవమున్న అధికారుల రిటైర్మెంట్‌తో ప్లానింగ్‌ విభాగ పనులు మరింత నత్తనడకన సాగే అవకాశముందనే చర్చ హెచ్‌ఎండీఏ వర్గాల్లో వినిపిస్తోంది. చివరిసారిగా 2009లో 11 మంది జూనియర్‌ ప్లానింగ్‌ ఆఫీసర్లను నియమించారు..అప్పటినుంచి ఇప్పటివరకు నియామకం లేదనే వాదన వినబడుతోంది.

సిబ్బంది తక్కువ...పని ఎక్కువ
లేఅవుట్, బిల్డింగ్‌ పర్మిషన్ల కోసం డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(డీపీఎంఎస్‌)కు ఆన్‌లైన్‌ అనుమతుల దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. జేపీవో, ఏపీవో స్థాయి అధికారులు ఉదయం నుంచి మధ్యాహ్యం వరకు రోజుకు మూడు సైట్‌ ఇన్‌స్పెక్షన్లు అది కూడా వారి ప్రాంతానికి సంబంధించి కాక వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇన్‌స్పెక్షన్‌తోనే సమయం గడిచిపోతోంది. ఆ తర్వాత సైట్‌ ఇన్‌స్పెక్షన్‌ రిపోర్టు, టెక్నికల్‌ స్క్రూటిని, అవసరమైతే పైస్థాయి అధికారుల ఇన్‌స్పెక్షన్‌ కూడా ఉంటుంది. బిల్డింగ్‌ పర్మిషన్, లేఅవుట్‌ విత్‌ హౌసింగ్, మల్టీస్టోర్‌ బిల్డింగ్, లేఅవుట్‌లు, ల్యాండ్‌ యూజ్‌ సర్టిఫికెట్, పెట్రోల్‌ పంప్, చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌ పనులన్నీ ప్లానింగ్‌ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. దీనికితోడు లే అవుట్‌ రెగ్యులేషన్‌ స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తులను కూడా డీపీఎంఎస్‌ పనుల మాదిరిగానే కసరత్తు చేస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ప్రశ్నలకు సమాధానాలతో పాటు కోర్టు వరకు వెళ్లిన కేసుల్లో ఆయా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. క్వారీ ఎన్‌వోసీలు కూడా వీరే జారీ చేస్తున్నారు. ఇలా ఉన్నా కొంతమంది సిబ్బందే అన్నీ పనులు పర్యవేక్షిస్తుండటంతో వారిపై పనిభారం పడుతోంది. 2003లో ప్రభుత్వం మంజూరు చేసిన 124 పోస్టులకు ఖాళీగా ఉన్నా దాదాపు 80కిపైగా పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం కనబడుతోంది. ఈ మేరకు హెచ్‌ంఎడీఏ పూర్వ కమిషనర్‌ టి.చిరంజీవులు పలుమార్లు ప్లానింగ్‌ విభాగ సిబ్బంది భర్తీ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఇప్పటివరకు ఆ దిశగా ఎటువంటి నిర్ణయం రాకపోవడంతో ఉన్నా సిబ్బందిపైనే అదనపు భారం పడుతోందని హెచ్‌ఎండీఏ అధికారులు అంటున్నారు.  

ఆదాయం పెరుగుతున్నా...
భవన నిర్మాణాలు, లేఅవుట్‌ పర్మిషన్ల ద్వారా హైదరాబాద్‌ మహానగర అభివద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అనుమతుల కోసం దరఖాస్తులు వందలసంఖ్యలో వస్తున్నాయి. డెవలప్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌తో పాటు ఆఫ్‌లైన్‌ ద్వారా బిల్డింగ్, లేఅవుట్‌ పర్మిషన్లకు ప్రతి నెలా రూ.36 నుంచి 38 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఇలా నెలనెలకు ఆదాయం పెరుగుతున్నా సిబ్బంది సంఖ్య పెంచితే ఈ ఆదాయం మరింత రెట్టింపు కావొచ్చని హెచ్‌ఎండీఏ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పుడు పనుల్లో కూడా నాణ్యత పెరిగి సంస్థకు మంచి పేరు వస్తుందని చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు