కొత్త సవాళ్లు..

13 Feb, 2015 00:20 IST|Sakshi
కొత్త సవాళ్లు..

పత్యామ్నాయ ఉపాధిలో భాగంగా రైతులు పాడివైపు పరుగులు తీస్తున్నారు. ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం... ప్రభుత్వం ఇటీవలే విజయ డెయిరీ పాల ధరను లీటర్‌కు రూ.4 పెంచడం కూడా ఇందుకు ఊతమిస్తోంది. వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలవాల్సిన పశువైద్యం జిల్లాలో అధ్వానంగా మారింది. సిబ్బంది కొరతతో పలు కేంద్రాలు మూతపడ్డాయి. చాలాచోట్ల అటెండర్లే వైద్యం అందిస్తున్నారు. ఈ దశలో రైతులు కుంగిపోతున్నారు.     
 
‘మిల్క్ గ్రిడ్’కు సిబ్బంది కొరత
ఖాళీల భర్తీలో ఏళ్ల తరబడి నిర్లక్ష్యం
కునారిల్లుతున్న పశువైద్య కేంద్రాలు
చాలాచోట్ల అటెండర్లే దిక్కు
ఇప్పటికే కొన్ని మూత
పశువైద్యాన్ని మెరుగుపరిస్తేనే మేలు

గజ్వేల్: వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం పాడి పోషణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించింది. విజయ డెయిరీ పాల ధరను లీటర్‌కు రూ.4కు పెంచడం, ‘మిల్క్‌గ్రిడ్’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టడం.. గజ్వేల్‌లో ఈ పథకానికి అంకురార్పణ జరగటంతో రైతుల్లో ఉత్సాహం రెట్టింపైంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలు కొరవడటం వారికి శాపంగా మారింది. మిల్క గ్రిడ్‌తోపాటు ఇతర పథకాల అవులుకు పశువైద్య  కేంద్రాల్లో నెలకొన్న సవుస్యలు అవరోధంగా మారనున్నట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో మొత్తం 106 పశువైద్యాధికారుల పోస్టులకు గాను ప్రస్తుతం 47 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 136 మంది డిప్లొమా హోల్డర్స్‌కు గాను 90 మంది, 236 మంది నాలుగో తరగతి ఉద్యోగులకు గాను 171 మందే పనిచేస్తున్నారు. ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి అంకురార్పణ జరిగిన గజ్వేల్ నియోజక వర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మొత్తం 12 మంది వైద్యాధికారులు పోస్టులకు గాను ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30 డిప్లొమా హోల్డర్స్‌కు గాను 18 పోస్టులు ఖాళీగా, 20 మంది నాలుగో తరగతి ఉద్యోగులకు 12 ఖాళీలున్నాయి.
 
అధ్వానంగా కేంద్రాలు..
 గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లితోపాటు మరికొన్ని పశువైద్య కేంద్రాలు మూతపడ్డాయి. నియోజక వర్గంలోని చాలా కేంద్రాలు అటెండర్లపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఈ దశలో ‘మిల్క్ గ్రిడ్’ ద్వారా విరివిగా పశువులను అందించి ‘పాలధారను’ పెంచాలనుకుంటుండగా రైతులు మాత్రం పశువైద్యంపై ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. ఇదిలావుంటే ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి కొత్త రూపు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రాబోతున్న పథకంలో దాణా, వైద్యం తదితర సౌకర్యాలు కల్పించనున్నామని రెండు రోజుల క్రితం గజ్వేల్‌లో పర్యటించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు