ఇక..స్టాండింగ్ కమిటీల వంతు!

13 Jul, 2014 03:00 IST|Sakshi
ఇక..స్టాండింగ్ కమిటీల వంతు!

 నల్లగొండ :జిల్లాపరిషత్ పాలకవర్గం కొలువుదీరడంతో ఇప్పుడు అందరి దృష్టి స్టాండింగ్ కమిటీలపై పడింది. జెడ్పీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన 60 రోజుల్లోగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ సమావేశంలో ముందుగా స్టాండింగ్ కమిటీలకు ఎన్నిక ఉంటుంది. సభ్యుల మధ్య పోటీ ఏర్పడితే రహస్య ఓటింగ్ నిర్వహిస్తారు. లేనిపక్షంలో ఏకగ్రీవంగానే ఎన్నుకుంటారు. జిల్లాపరిషత్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ స్టాండింగ్ కమిటీలకు ఎన్నిక జరగలేదు. సభ్యులందరినీ ఏకగ్రీవంగానే కమిటీల్లో నియమించారు.
 
 ఏడు కమిటీలు
 జిల్లా పరిషత్‌లో మొత్తంగా ఏడు స్టాండింగ్ కమిటీలు ఉన్నాయి. జెడ్పీ చైర్మన్ నాలుగు కమిటీలకు, వైస్‌చైర్మన్ ఒక కమిటీకి చైర్మన్‌గా ఉంటారు. మహిళా సంక్షేమ స్థాయి కమిటీలో కేవలం సభ్యులు ఉంటారు. అయితే ఈ కమిటీలో సగం మంది మహిళలు తప్పనిసరిగా ఉండాలి. సాంఘిక సంక్షేమ స్థాయి కమిటీ లోనూ సభ్యులే ఉంటారు. ఇక్కడా సగం మంది మహిళలకు అవకాశం కల్పించాలి. ఈ సగం మందిలోనూ   ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సభ్యులకు అవకాశం ఇవ్వాలి. ప్రణాళిక-ఆర్థిక స్థాయి, పనుల స్థాయి కమిటీల్లో సభ్యులుగా ఉండేందుకు జెడ్పీటీసీల్లో  పోటీ ఎక్కువగా ఉంటుంది. ఒక్కో కమిటీలో 11మంది సభ్యులు ఉండగా, జెడ్పీ పరిధిలో మొత్తంగా  79 సభ్యులు (జెడ్పీటీసీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు) ఉంటారు.
 
 కమిటీల ఎన్నిక ఇలా...
 ఇప్పటిదాకా స్టాండింగ్ కమిటీలకు ఎన్నికలు జరగలేదు. ఏకగ్రీవంగానే కమిటీలకు సభ్యులను ఎన్నుకున్నారు. జెడ్పీ చైర్మన్ ఇచ్చిన జాబితా ప్రకారం సర్వసభ్య సమావేశం రోజున ఏ కమిటీల్లో ఎవరిని నియమించారనే విషయాన్ని ప్రకటిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సూచనల మేరకే జెడ్పీటీసీ సభ్యులను కమిటీల్లో నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా వచ్చిన ప్రతిపాదనలనే జెడ్పీ చైర్మన్ ఆమోదిస్తూ వచ్చారు. ఏదేని విపత్కర పరిస్థితుల్లో ఎన్నిక నిర్వహించాల్సి వస్తే మాత్రం రహస్య ఓటింగ్ ద్వారానే కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. ఉదాహరణకు  ఓ  కమిటీకి 15 పోటీ పడుతుంటే, 11 మందిని మాత్రమే ఎన్నుకునేందుకు  రహస్య ఓటింగ్ నిర్వహిస్తారు. మిగిలిన జెడ్పీటీసీ సభ్యులందరు కూడా ఈ ఓటింగ్‌లో పాల్గొంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు  మాత్రం ఓటు హక్కు ఉండదు. జెడ్పీ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులకు చివరి వరకూ పోటీలో ఉన్న నేతలు ముఖ్యమైన కమిటీల్లో చోటు దక్కించుకునేందుకు అప్పుడే తమ గాడ్‌ఫాదర్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు