నిజామాబాద్‌లో స్టార్‌ వార్‌..

25 Nov, 2018 11:11 IST|Sakshi

జిల్లాకు ప్రధాన పార్టీల అగ్రనేతలు

రేపు నాలుగు చోట్ల  కేసీఆర్‌ బహిరంగసభలు

 27న నగరానికి  ప్రధాని మోదీ రాక..

 రాహుల్‌ సభకు కాంగ్రెస్‌ సన్నాహాలు

 పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

 హోరెత్తుతున్న ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయి ముఖ్యనేతలు ఉమ్మడి జిల్లా బాట పట్టారు. ఇప్పటికే మూడు చోట్ల పార్టీ అధినేత కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభలను నిర్వహించిన టీఆర్‌ఎస్‌ మరో నాలుగు చోట్ల బహిరంగసభలకు ఏర్పాట్లు చేసింది. సోమవారం కేసీఆర్, మంగళవారం ప్రధాన మంత్రి మోదీ ప్రచార సభలకు రానున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ సభను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాకు అగ్రనేతలొస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ పార్టీల ముఖ్యనేతలు జిల్లా బాట పట్టారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచార సభలను నిర్వహించాలని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించాయి. ఇప్పటికే మూడు చోట్ల ఎన్నికల ప్రచార సభలను నిర్వహించిన టీఆర్‌ఎస్‌ మరో నాలుగు చోట్ల జరగనున్న బహిరంగసభలకు ఏర్పాట్లు చేసింది. ఈనెల 27న నిజామాబాద్‌ నగరంలో జరగనున్న భారీ బహిరంగసభకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. స్థానిక గిరిరాజ్‌ కళాశాల మైదానంలో బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బహిరంగ సభలు సోమవారం జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో  కామారెడ్డి, డిచ్‌పల్లి (నిజామాబాద్‌ రూరల్‌), బోధన్, బాల్కొండల్లో ఈ సభలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌ కూడా మరోమారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కామారెడ్డిలో రాహల్‌గాంధీ సభ జరిగింది. అగ్రనేతల రాకతో జిల్లాలో ప్రచారం హోరెత్తుతోంది.

ప్రధాని హోదాలో తొలిసారి ..

నరేంద్రమోదీ ప్రధాన మంత్రి హోదాలో జిల్లాకు తొలిసారిగా రానున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో పర్యటించిన ఆయన  ఈసారీ ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు వస్తున్నారు. సభను నిజామాబాద్‌ నగరంలోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో నిర్వహించాలని నిర్ణయించిన ఆ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ మైదానాన్ని పోలీసు బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. మోదీ బహిరంగసభ ఏర్పాట్లను ఆ పార్టీ కేంద్ర మంత్రి జేపీనడ్డా పరిశీలించారు. మోదీ బహిరంగసభ జిల్లాలోని బీజేపీ అభ్యర్థుల్లో నూతనోత్సాహం నింపుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరో కేంద్ర సహాయ మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ నగరంలో చాయ్‌పే చర్చలో పాల్గొన్నారు. అలాగే స్వామి పరిపూర్ణనంద, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్, ఎల్లారెడ్డి, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లో పార్టీ అధినేత కేసీఆర్‌ బహిరంగసభలను నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ఈనెల 26న ఉమ్మడి జిల్లాలో నాలుగు చోట్ల వరుస సభలను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం కామారెడ్డి బహిరంగ సభ అనంతరం నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని డిచ్‌పల్లి వద్ద, అలాగే బోధన్‌ నియోజకవర్గ కేంద్రంలో, బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌లో సభలను నిర్వహిస్తోంది. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల పరిధిలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను, కార్యకర్తలను ప్రజలను తరలించేందుకు ఆ పార్టీ అభ్యర్థులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎల్లారెడ్డి, ఆర్మూర్‌లలో నిర్వహించిన కేసీఆర్‌ సభలతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది.

 రాహుల్‌ సభ నిర్వహించే యోచన 

ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ మరోమారు జిల్లాకు రానున్నారు. ఇప్పటికే కామారెడ్డిలో కాంగ్రెస్‌ రాహుల్‌గాంధీ బహిరంగసభను నిర్వహించిన విషయం విధితమే. ఈసారి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని బోధన్‌లో గానీ, ఆర్మూర్‌లో గానీ ఈ సభను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. వీలైతే జిల్లా కేంద్రంలో రాహుల్‌ సభను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా స్టార్‌ క్యాంపెయినర్లతో ప్రచార కార్యక్రమాలకు కార్యచరణ రూపొందిస్తోంది. పలుచోట్ల రేవంత్‌రెడ్డితో రోడ్‌షోలు, సభలను నిర్వహించే యోచనలో ఉంది.  విజయశాంతి వంటి నేతలు కాంగ్రెస్‌ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. మొత్తం మీద అగ్రనేతల ప్రచారంతో జిల్లా హోరెత్తనుంది.  

మరిన్ని వార్తలు