రూపాయి తీస్కో.. పండగ చేస్కో!

25 Jan, 2015 02:58 IST|Sakshi
రూపాయి తీస్కో.. పండగ చేస్కో!

* జెండావందన వేడుకల నిర్వహణ  అయోమయం    
* అరకొర నిధులతో ఉపాధ్యాయుల అవస్థలు
* స్వీట్ కోసం ప్రతీ విద్యార్థికి ఒక్క రూపాయే..
* ఏళ్లనాటి పాత టారిఫ్‌లే అమలవుతున్న వైనం

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఇంద రూపాయి తీసుకో.. నోరు తీపి చేసుకొని పండగ చేసుకో పో’.. అంటోంది ప్రభుత్వం. ‘ఏంటీ రూపాయికి ఏం వస్తుంది, పీచు మిఠాయి కూడా రాదు.. అనుకుంటున్నారా? అది నిజమే కానీ, ప్రభుత్వం ఇంతే ఇస్తుంది మరి. వివరాలలోకి వెళ్తే గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఆయా పాఠశాలల్లో, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులకు మిఠాయిలు పంచుతారు.

హాస్టల్ విద్యార్థులకు ప్రతిరోజూ ఇచ్చే మెనూకు అదనంగా పండుగల రోజున మిఠాయి కూడా ఇస్తారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు అన్ని కలుపుకొని 168 వరకు ఉన్నాయి. వీటిలో 16 వేల మంది వరకు విద్యార్థులు అభ్యసిస్తున్నారు. హాస్టళ్లలో ఉన్న వారికి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఇచ్చేది మాత్రం కేవలం రూ.1 మాత్రమే. దాదాపు 35 ఏళ్ల కిందట, అంటే  ఒక్క రూపాయికి పావుకిలో నెయ్యి, పావుకిలో చెక్కర, ఇతర పదార్ధాలు వచ్చే సమయంలో తీసుకున్న నిర్ణయం అన్న మాట. తరాలు మారినా ఈ టారిఫ్ మాత్రం మారలేదు. ఇప్పుడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోయింది.

నిత్యావసరాల ధరలు చుక్కలను అంటాయి. రూపాయి పెడితే బజార్లలో సైకిల్ మీద అమ్మే పీచు మిఠాయి కూడా రావడం లేదు. కనీసం 20 గ్రాముల స్వీటు, 5 గ్రాముల కార తీసుకోవాలన్నా కనీసం రూ.10 ఖర్చు అవుతున్నాయి. ఈ లెక్కన ప్రతీ హాస్టల్‌లో రూ.1,500 వరకు, పాఠశాలలో రూ.4 నుంచి 6.వేల వరకు ఖర్చు అవుతుంది. ఇక పాఠశాలల్లోనైతే మిఠాయిల కోసం ప్రత్యేకంగా ఆ.. ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. జిల్లాలో చిన్న, పెద్ద స్కూళ్లు కలుపుకుని దాదాపు 1,568 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3.23 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.

వీళ్లకు కూడా జెండా వందనం రోజున స్వీట్ ఇస్తున్నారు, కానీ స్వీట్ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. దీంతో పాఠశాల గోడలకు సున్నం వేయడం కోసమో, రిపేర్ కోసమో ఇచ్చే స్కూల్ మెయింటనెన్స్ నుంచి గాని, స్టేషనరీ ఖర్చుల కోసం స్కూల్ గ్రాంటు  నిధుల నుంచి గాని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు మిఠాయిల కోసం ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వమైనా బూజుపట్టిన పాత టారిఫ్‌ను తొలగించి.. కొత్త టారిఫ్‌ను అమల్లోకి తేవాలని  విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు