వెద్యుల ‘పీజీ’ కలలు కల్లలు చేయొద్దు

29 Mar, 2018 02:45 IST|Sakshi

 జీవో 21, 22లను కొట్టేయండి.. హైకోర్టులో వాదనలు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: పీజీ వైద్య విద్యలో ఇన్‌ సర్వీస్‌ కోటాను ఎత్తివేసి, దాని స్థానంలో వెయిటేజీ ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై బుధవారం హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఇన్‌ సర్వీస్‌ కోటాకు బదులు వెయిటేజీ ఇస్తూ ఈ నెల 22న జారీచేసిన జీవోలు 21, 22లను కొట్టేయాలని, 2017లో జారీచేసిన జీవో 27 ప్రకారమే ప్రవేశాలు కల్పించేలా కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాదులు విద్యాసాగర్, రఘురామ్‌లు వాదించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించిన వైద్యులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు.

ఇన్‌సర్వీస్‌ కోటా కొనసాగించాలని కోరుతూ వైద్యులు ఎం.వసుచరణ్‌రెడ్డి, మరో 12 మంది దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది. కొత్త విధానాన్ని కొనసాగిస్తే చాలా మంది వైద్యులు పీజీ చేయకుండానే మిగిలిపోతారని, పీజీ చేయాలనే వారి కలలు కల్లలవుతాయన్నారు. ఎంసీఐ నిబంధనల ప్రకారం పీజీలో నేషనల్‌ పూల్‌కు 50 శాతం సీట్లు పోగా, మిగిలిన 50 శాతం సీట్లు స్థానికులకే చెందుతాయని ప్రభుత్వం తాజా జీవోల్లో పేర్కొందని వారు హైకోర్టుకు వివరించారు. ఈ జీవోలు ఏపీ పునర్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 95కు విరుద్ధమన్నారు. పునర్విభజన చట్టంలో ఇన్‌ సర్వీస్‌ కోటా విద్యార్థులకు నిర్దేశించిన కోటా పదేళ్లపాటు అమల్లో ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారని, ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఈ జీవోలు జారీ చేసిందన్నారు. దీనిపై గురువారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.  

మరిన్ని వార్తలు