సృజనాత్మకతతోనే స్టార్టప్‌లు

10 Jan, 2017 01:40 IST|Sakshi
సృజనాత్మకతతోనే స్టార్టప్‌లు

మద్రాస్‌ ఐఐటీలో మంత్రి కేటీఆర్‌
పరిశోధనలకు మరింత ఊతమివ్వాలి
ఐఐటీలతో పనిచేసేందుకు సిద్ధమని వెల్లడి  


సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తేనే దేశంలో అంకుర పరిశ్రమ (స్టార్టప్‌)ల వాతావరణం వృద్ధి చెందుతుందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఉన్నత ప్రమాణాలతో బోధించే ఐఐటీ తరహా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు పరిశోధనలకు మరింత ఊతం ఇవ్వాలని కోరారు. కొత్త తరం ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే విధంగా ప్రభుత్వ విధానాల రూపకల్పన జరగాలని... ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం టీ–హబ్‌ వంటి సంస్థలను నెలకొల్పిందని తెలిపారు. దేశంలో స్టార్టప్‌ల బలోపేతం అంశంపై సోమవారం మద్రాస్‌ ఐఐటీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించిందని తెలిపారు.

యువశక్తిని గుర్తించాలి..
యువశక్తిని గుర్తిస్తూ కొత్త భారతాన్ని నిర్మించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని... యువత పరిశోధనల వైపు మళ్లినప్పుడే ఫేస్‌బుక్, టెస్లా తరహా వినూత్న ఆవిష్కరణలు మన దేశంలోనూ సాధ్యమవుతాయని పేర్కొన్నారు. దేశ యువత ఐటీ రంగంలో విస్తృత నైపుణ్యం కలిగి ఉందని.. దానిని స్టార్టప్‌ల రంగంతో అనుసంధానం చేయాల్సిన అవసర ముందని చెప్పారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన టీ–హబ్, కొత్తగా ఏర్పాటు చేసే టీ–టవర్స్‌ లాంటి కార్యక్రమాలను దేశంలోని ప్రతి ఒక్క యువకుడు, విద్యార్థి ఉప యోగించుకోవచ్చన్నారు.

ఈ సందర్భంగా టీ–హబ్‌ పనితీరు, స్టార్టప్‌ ఈకో సిస్టంకు అందిస్తున్న ప్రోత్సాహం,  టీ–బ్రిడ్జ్‌ ద్వారా సిలి కాన్‌ వ్యాలీతో అనుసంధానం కోసం తీసుకుంటున్న చర్యలను కేటీఆర్‌ వివరించారు. ప్రతిష్టాత్మక ఐఐటీ వంటి సంస్థలతో కలసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తన ప్రసంగం తర్వాత విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మద్రాస్‌ ఐఐటీ డైరెక్టర్‌ భాస్కర్‌ రామూర్తి, పరిశ్రమలు, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు