15న రాష్ట్ర బడ్జెట్‌

13 Mar, 2018 00:53 IST|Sakshi

12 రోజుల పాటు అసెంబ్లీ 

బీఏసీ భేటీలో నిర్ణయాలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలను 12 రోజులు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 15న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.  సోమవారం అసెంబ్లీ లో గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత.. స్పీకర్‌ ఎస్‌.మధుసూదనాచారి అధ్యక్షతన ఆయన కార్యాలయంలో బీఏసీ సమావేశం జరిగింది. డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్, కడియం, ఈటల, పోచారం, కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, భట్టివిక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్, బీజేï ఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, టీడీఎల్పీ నేత సండ్ర వెంకటవీరయ్య, సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య ఈ భేటీలో పాల్గొన్నారు. 

మూడు రోజులు సెలవులు: గవర్నర్‌ ప్రసంగంతో సోమవారం ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాలు.. ఈ నెల 27 దాకా జరుగుతాయి. 13, 14వ తేదీల్లో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, ప్రభుత్వ వివరణ ఉంటాయి. 15న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 16, 17, 18 తేదీల్లో ఉగాది సెలవులు. 19న బడ్జెట్‌పై చర్చ, ఆర్థిక మంత్రి వివరణ, 20 నుంచి 25 వరకు డిమాండ్లు, పద్దుల మీద చర్చ, వివరణలు, ఓటింగ్‌ ఉంటాయి. 25న ఆదివారమైనా కూడా సభను నిర్వహించాలని నిర్ణయించారు. 26న శ్రీరామనవమి సందర్భంగా సెలవు. 27న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిస్తారు.

మరిన్ని వార్తలు