రాష్ట్ర బడ్జెట్‌ కౌంట్‌ డౌన్‌ షురూ!

2 Mar, 2018 04:54 IST|Sakshi

రెండో వారంలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు

1.49 లక్షల కోట్ల అంచనా.. 90 వేల కోట్లకు చేరిన రాబడి

జనవరి వరకు ఆదాయ వ్యయాల నివేదిక కాగ్‌కు సమర్పణ

గతేడాదితో పోలిస్తే పెరిగిన రెవెన్యూ రాబడి

జీఎస్టీ ప్రభావంతో తగ్గిన ఆదాయం...

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌ కౌంట్‌ డౌన్‌ మొదలైంది. ఈ నెల రెండో వారంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక శాఖ సన్నాహాలు మెదలుపెట్టింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం మేరకు వరుసగా ఐదో ఏడాది భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో ఆర్థిక పరిస్థితులేంటి.. గతేడాది జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ ప్రభావం ఎంత.. ఆదాయ వ్యయాలెలా ఉన్నాయో.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయ వ్యయాల చిట్టాను కాగ్‌కు సమర్పించింది. 2018 జనవరి నెలాఖరు వరకు ఉన్న వివరాలను ఇందులో పొందుపరిచింది.  
రూ.1.10 లక్షల కోట్లకు ఆదాయం!
కాగ్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం.. 2017–18 ఆర్థిక సంవత్సరంలో మిగులు ఆదాయం ఉంటుందని ప్రభుత్వం వేసిన అంచనాలు అందుకోవటం కష్టంగానే ఉంది. మొత్తం రూ.1.49 లక్షల కోట్ల రాబడి అంచనా వేసిన ప్రభుత్వం.. జనవరి నెలాఖరు వరకు రూ.90,330 కోట్ల ఆదాయాన్ని అందుకుంది. అందులో రూ.87 వేల కోట్లు ఖర్చు చేసింది. సగటున ప్రతినెలా రూ.9 వేల కోట్ల ఆదాయం నమోదు చేసుకుంది. అదే అంచనాతో ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఫిబ్రవరి, మార్చి నెలల ఆదాయం కూడా జోడిస్తే.. రాష్ట్ర ఆదాయం దాదాపు రూ.1.10 లక్షల కోట్లకు చేరే అవకాశముంది. వాస్తవ ఆదాయానికి మించి అంచనాలు వేసుకోవటంతో పాటు ఏడాది మధ్యలో కేంద్రం తెచ్చిన జీఎస్టీ ఎఫెక్ట్‌తోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక సంవత్సరంలో రూ.4,571 కోట్ల మిగులు ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం తొలి పది నెలల్లో రూ.3,643 కోట్ల లోటును కాగ్‌కు చూపించింది.  

15.6 శాతం ఆదాయ వృద్ధి..
అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రాష్ట్ర రెవెన్యూ రాబడి మొత్తం 13 శాతం ఎగబాకింది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 15.6 శాతం వృద్ధి సాధించింది. 2016–17లో తొలి పది నెలల్లో పన్నుల ద్వారా రూ.48,704 కోట్ల ఆదాయం సమకూరగా, ఈ జనవరి నెలాఖరుకు రూ.56,348 కోట్ల రాబడి వచ్చింది. ప్రధానంగా ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయం ఖజానాకు ఊతమిచ్చింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఎక్సైజ్‌ డ్యూటీ అమాంతం రూ.3,500 కోట్లు, స్టాంపుల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం రూ.410 కోట్ల మేరకు పెరిగింది.  

జీఎస్టీతో రూ.7వేల కోట్ల గండి..
అయితే జీఎస్టీతో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది. 2016–17లో పది నెలల్లోనే వ్యాట్‌ ద్వారా రూ.27 వేల కోట్ల ఆదాయం వస్తే.. వ్యాట్‌ స్థానంలో వచ్చిన జీఎస్టీతో ఈ సారి రూ.20,882 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో జీఎస్టీతో దాదాపు రూ.7 వేల కోట్ల గండి పడింది. ద్రవ్య లోటును భర్తీ చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.24,140 కోట్లు అప్పులు తీసుకుంది.

మరిన్ని వార్తలు