క్యాంప్‌లు నిర్వహిస్తే కోడ్‌ ఉల్లంఘించినట్టే

2 Jun, 2019 02:29 IST|Sakshi

పరిషత్‌ పదవులపై రాజకీయ పార్టీలకు ఎస్‌ఈసీ స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: క్యాంపు రాజకీయాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) స్పష్టతనిచ్చింది. వివిధ పరిషత్‌ పదవులకు నిర్వహించే పరోక్ష ఎన్నికల సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులతో క్యాంప్‌ రాజకీయాలు నిర్వహిస్తే అది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని వివిధ రాజకీయపార్టీలకు ఎస్‌ఈసీ తెలిపింది. కౌంటింగ్‌కు, ఎన్నికల నిర్వహణకు మధ్య మూడురోజుల వ్యవధి ఉన్నందున క్యాంప్‌ రాజకీయాలకు ఆయా పార్టీలు ఆస్కారం కల్పించినట్టు రుజువైతే నియమ, నిబంధనల ప్రకారం ఎస్‌ఈసీ చర్యలు చేపడుతుందని హెచ్చరించింది.ఈ నెల 7న మండల ప్రజాపరిషత్‌(ఎంపీపీ), 8న జిల్లా ప్రజా పరిషత్‌ (జెడ్పీపీ) పదవులకు నిర్వహించే ఎన్నికలకు సంబంధించిన అంశాలపై వివిధ రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ శనివారం ఎస్‌ఈసీ కార్యాలయంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించింది.

మండల, జిల్లా ప్రజాపరిషత్‌ కో ఆప్టెడ్‌ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జెడ్పీపీ చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాల గురించి వివరించారు. కోఆప్టెడ్‌ ఎన్నికలకు పాటించాల్సిన నియమ, నిబంధనలు, జెడ్పీపీ, ఎంపీపీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు విప్‌లు ఎలా జారీచేయాలి, ఎప్పటిలోగా వాటిని పంపించాలి తదితర అంశాలను గురించి రాజకీయపార్టీల ప్రతినిధులకు వివరించారు. ఈ ఎన్నికల్లో ఎస్‌ఈసీ నిర్దేశించిన మార్గదర్శకాలు ఏమిటీ, రాజకీయ పార్టీలవారీగా పాటించాల్సిన విధానాలు ఏమిటన్న దానిపై అవగాహన కల్పించారు.

ఎంపీపీ, జెడ్పీపీ పదవులకు నిర్వహించే ప్రత్యేక సమావేశా ల్లో కోరం లేకపోతే ఏం చేయాలి, ఆ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలను వివరిం చారు. ఎస్‌ఈసీ తీసుకున్న చొరవ వల్లే మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతోందని వారు పేర్కొన్నారు. సమావేశంలో కమిషనర్‌ వి.నాగిరెడ్డి, కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్, సంయుక్తకార్యదర్శి జయసింహారెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి జి.నిరంజన్, మర్రి శశిధర్‌రెడ్డి(కాంగ్రెస్‌), శ్రీనివాసరెడ్డి, గట్టు రామచంద్రరావు (టీఆర్‌ఎస్‌), ఎన్‌.బాలమల్లేశ్‌(సీపీఐ), నంద్యాల నర్సింహారెడ్డి(సీపీఎం), ఇతరపార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు