నేడు పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌!

20 Apr, 2019 05:02 IST|Sakshi

ఏర్పాట్లు పూర్తి చేసినరాష్ట్ర ఎన్నికల సంఘం 

కొత్తగా 4 మండలాల్లోరిజర్వేషన్లు ఖరారు

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. శనివారం ఎన్నికల షెడ్యూల్‌ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా ఏర్పడిన 4 మండలాల్లోని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ల ఖరారుపై ఆయా జిల్లాల కలెక్టర్లు శుక్రవారం గెజిట్లు విడుదల చేశారు. శుక్రవారం సెలవు దినం కావడంతో షెడ్యూల్‌ జారీ చేయలేదు. దీంతో శనివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు.

ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల జాబితా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జెడ్పీపీ, ఎంపీపీ స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల ఖరారైన విషయం తెలిసిందే. కాగా, ఈ నెల 22 నుంచి మే 14లోగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ముగించేలా ముసాయిదా షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. మూడు విడతల్లో పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. 26 జిల్లాల్లో మూడు విడతల్లో, ఐదు జిల్లాల్లో 2 దశల్లో, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 

4 మండలాల్లో రిజర్వేషన్లు ఇలా.. 
కొత్తగా ఏర్పడిన నాలుగు మండలాల్లో ఎంపీపీ అధ్యక్ష స్థానాలు, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జెడ్పీటీసీ రిజర్వేషన్లు.. నిజామాబాద్‌ జిల్లాలోని చండూరు (ఎస్టీ), మోసర (జనరల్‌), సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట (జనరల్‌), మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి (జనరల్‌) కేటగిరీలకు రిజర్వ్‌ అయ్యాయి. ఎంపీపీ స్థానం రిజర్వేషన్లు.. నిజామాబాద్‌ జిల్లాలోని చండూరు ఎంపీపీ ఎస్టీలకు, మోసర ఎంపీపీ జనరల్‌కు, సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట ఎంపీపీ జనరల్‌కు, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి ఎంపీపీ బీసీ కేటగిరీలకు రిజర్వ్‌ అయ్యాయి.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్లు ఈ నెల 22, 26, 30 తేదీల్లో విడుదల కానున్నాయి. తొలి విడత ఎన్నికలు మే 6, రెండో విడత 10, తుది విడత ఎన్నికలు 14న జరగనున్నాయి. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పరిషత్‌ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకు జెడ్పీపీ చైర్‌పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షుల ఎంపిక ఉంటుంది. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీపీ చైర్‌పర్సన్, ఎంపీపీ అధ్యక్ష స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పోర్టల్‌లో అధికారులు పొందుపరిచారు.

మరిన్ని వార్తలు