‘ముందస్తు’కు సిద్ధం

21 Aug, 2018 01:58 IST|Sakshi

రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు  

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే చర్చ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం దీనికి సిద్ధమవుతోంది. సాధారణ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌–మేలో జరిగినా... అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చినా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్ల తుది జాబితా రూపకల్పన ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిన గడువులోగా పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం (సీఈవో) ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగే పరిస్థితుల్లో దీనికి అనుగుణంగా ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియను మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం)ను, ఓటరు రసీదు పరికరాల (వీవీప్యాట్‌)ను సమకూర్చుకుంటోంది. ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో కీలకమైన పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ చివరిదశకు చేరింది.

పోలింగ్‌ శాతాన్ని పెంచేలా వాటి హేతుబద్ధీకరణ జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో 32,204 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఈసారి ఓటర్లకు మరింత అనువుగా ఉండేలా కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు పాత వాటి స్థలం మార్పు ప్రక్రియ జరుగుతోంది. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ మరో వారంలో ముగియనుంది. జిల్లాలవారీగా ప్రతిపాదనలు సీఈవో కార్యాలయానికి చేరుతున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం రాష్ట్రంలోని పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 34,300కు చేరనుంది. గత ఎన్నికల కంటే దాదాపు మూడు వేల పోలింగ్‌ కేంద్రాలు పెరగనున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీకి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే 2.5 లక్షల మంది అధికారులు, సిబ్బంది అవసరమవుతారు. కేవలం అసెంబ్లీకి మాత్రమే అయితే రెండు లక్షల మంది విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 

రాష్ట్రంలో తొలిసారి వీవీప్యాట్‌లు... 
ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రానికి 84,400 ఈవీఎంలను, అంతే సంఖ్యలో ఓటరు రసీదు పరికరాల (వీవీప్యాట్‌)ను సిద్ధం చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓటరుకు రసీదు ఇచ్చే విధానం రాష్ట్రంలో తొలిసారి అమలులోకి రానుంది. ఓటరుకు రసీదు ఇచ్చేలా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు మొదటిసారిగా ఓటరు రసీదు పరికరాల (వీవీప్యాట్‌)లను అమర్చనున్నారు. వీవీప్యాట్‌లను అమర్చుతున్న నేపథ్యంలో ఒక్కో ఈవీఎంలో గరిష్టంగా 1,400 ఓట్లు మాత్రమే నమోదు చేసే అవకాశం ఉంటుంది. దీంతో పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,300 ఓటర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,200 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈసీఐ ఆదేశాల ప్రకారం: సీఈవో 
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన తాజా మార్గదర్శకాల ప్రకారం 2019 జనవరి 1 నాటికి ఓటర్ల సవరణ జాబితాను సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభకు, అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల విషయంలో నిర్ణ యం తీసుకుంటే దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు