మంత్రి గంగుల ఉదంతాన్ని పరిశీలిస్తాం.. 

25 Jan, 2020 07:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల సందర్భంగా ఎవరైనా రహస్య ఓటింగ్‌కు (బ్రీచ్‌ ఆఫ్‌ సీక్రసీ) భంగం కలిగించిన పక్షంలో వారు వేసిన ఓటు చెల్లకుండా పోవడంతో పాటు అది నేరం చేసినట్టవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి చెప్పారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ఓటేసిన మంత్రి గంగుల కమలాకర్‌ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి తాను టీఆర్‌ఎస్‌ కారు గుర్తుకు ఓటేశానని బహిరంగంగా వెల్లడించిన విషయాన్ని నాగిరెడ్డి దృష్టికి ఒక విలేకరి తెచ్చారు.

దీనిపై ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు నాగిరెడ్డి స్పందిస్తూ.. ఈ అంశంపై తమకు సమాచారం లేదన్నారు. ఇప్పుడు పేర్కొన్నది ఊహాజనితమైన (హైపోతిటికల్‌) దని, వాస్తవంగా అసలు ఏమి జరిగిందో పరిశీలించాకే నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు. అక్కడ ఏమి జరిగిందనే అంశం గురించి తెలుసుకుంటామన్నారు. నిజాంపేటలోని ఒక పోలింగ్‌బూత్‌లో ఒక యువతి ఓటేసేటప్పటికే దానిపై గుర్తు వేసి ఉందని చెప్పిందని, అయితే అక్కడ రీపోలింగ్‌ జరుపుతారా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ తమ దృష్టికి రానందున అది ఉత్పన్నం కాదన్నారు.

అంతేకాకుండా ఏదో జరిగిందనే విధంగా దుష్ప్రచారం చేయడం మంచిది కాదని నాగిరెడ్డి హెచ్చరించారు. మీడియా సమావేశాల్లో అవాస్తవమైన ఇలాంటి అంశాలను లేవదీయడం సరికాదని అన్నారు. సోషల్‌మీడియాలో ఈ ఉదంతం వైరల్‌ అయినందునే ప్రస్తావిస్తున్నారని ఇతర విలేకరులు పేర్కొనగా ఇది పూర్తిగా ఊహాతీతమైనది, పూర్తిగా తప్పని ఆయన స్పష్టంచేశారు. ఈ ప్రచారానికి బాధ్యులైన వారిపైనా క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజాంపేటలో అంత సవ్యంగా జరిగినట్టు.. ఎక్కడా దొంగ ఓటు, టెండర్‌ ఓటు పడినట్టు రిటర్నింగ్‌ అధికారి నుంచి నివేదిక రాలేదని మున్సిపల్‌శాఖ డైరెక్టర్‌ శ్రీదేవి స్పష్టం చేశారు. ఆ కార్పొరేషన్‌ పరిధిలో ఎన్నిక సజావుగా జరిగినట్టుగా జిల్లా కలెక్టర్‌ నుంచి కూడా తమకు రిపోర్ట్‌ వచ్చినట్టు ఆమె చెప్పారు.   

మరిన్ని వార్తలు