విభజన సమస్యలు పరిష్కరించండి

11 Aug, 2018 03:03 IST|Sakshi

     పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి 

     అపరిష్కృత సమస్యలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ 

     15 అంశాలను కేంద్రానికి నివేదించిన రాష్ట్రం 

     కాలపరిమితితో సమస్యలు పరిష్కరించాలని వినతి

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృత అంశాలు ఉన్నాయని, తెలంగాణలో కొన్ని అంశాలు పరిష్కారం కావాల్సి ఉందని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి తెలంగాణ ప్రభుత్వం వివరించింది. రాజ్యసభ సభ్యుడు పి.చిదంబరం నేతృత్వంలోని కేంద్ర హోం శాఖ స్టాండింగ్‌ కమిటీ శుక్రవారం సమావేశమై రాష్ట్ర విభజన అపరిష్కృత సమస్యలను తెలుసుకుంది. అపరిష్కృత అంశాలపై రాష్ట్ర సీఎస్‌ ఎస్‌కే జోషి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మొత్తం 15 అంశాలను తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం కాలపరిమితితో సమస్యలు పరిష్కరించాలని, ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలని, 10వ షెడ్యూలు సంస్థల ఆస్తులు అందుబాటులోకి వచ్చేలా చేయాలని సీఎస్‌ కోరారు. హైదరాబాద్‌లో ఖాళీ చేసిన ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం వాడుకునేలా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా అంశాలపై తగిన సిఫారసులు చేయాలని స్థాయీ సంఘానికి విన్నవించారు.
 
నదీ జలాల పంపిణీపై.. 
అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం పరిధిలోని సెక్షన్‌ 3 కింద తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. కృష్ణా నదీ జలాలను అన్ని రాష్ట్రాల మధ్య తిరిగి పంపిణీ చేపట్టాలని కోరాం. కానీ ఇప్పటివరకు కేంద్రం ట్రిబ్యునల్‌కు రెఫర్‌ చేయలేదు. కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్‌–2 అవార్డు ఇంకా ఇవ్వలేదు. నదీ జలాలపై తెలంగాణ హక్కులను ఏపీ విస్మరిస్తోంది. వ్యవస్థీకృత విధానం లేకుండా పోయింది. ఇప్పటివరకు కృష్ణా నదీ జలాల పంపిణీపై అపెక్స్‌ కౌన్సిల్‌ ఒకేసారి సమావేశమైంది. పట్టిసీమ విషయంలో బచావత్‌ అవార్డు అమలు కాలేదు. పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలి. పోలవరం బ్యాక్‌ వాటర్‌ ద్వారా భద్రాచలం సమీప ప్రాంతం ముంపునకు గురయ్యే అంశంపై అధ్యయనానికి ఆదేశాలు ఇవ్వాలి 

మౌలిక వసతులపై... 
తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం, ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. 4,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సంస్థను ఎన్టీపీసీ స్థాపించాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో సమీకృత స్టీలు ప్లాంటు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఇంకా అధ్యయన దశలోనే ఉంది. తెలంగాణలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో రహదారి వ్యవస్థను కేంద్ర జాతీయ రహదారుల సంస్థ మెరుగుపరచాల్సి ఉంది.  

ముఖ్యమైన అంశాలు ఇవీ.. 
- శాసనసభ స్థానాలు: ఈ చట్టం ప్రకారం తెలంగాణలో శాసనసభ స్థానాల సంఖ్య 119 నుంచి 153కు పెరగాల్సి ఉంది. దీని తాజా పరిస్థితి తెలియకుండా పోయింది. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడం పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలపై ప్రభావం చూపింది. ఈ మూడు ఎస్టీ నియోజకవర్గాలు. తెలంగాణలో ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల సంఖ్యపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇంకా తేల్చలేదు. 
హైకోర్టు విభజన: హైకోర్టు విభజన జరగకపోవడం తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఉమ్మడి హైకోర్టులో మొత్తం 61 మంది న్యాయమూర్తులకు గాను 29 మంది న్యాయమూర్తులు పనిచేస్తుండగా ఇందులో ఆరుగురే తెలంగాణకు చెందినవారు. హైకోర్టు బార్‌ రెండుగా విడిపోయి హైకోర్టు ఆవరణలోనే పలుమార్లు ఆందోళనలు చోటు చేసుకున్నాయి. 
రెవెన్యూ పంపిణీ: కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన నిధులు రూ.1,630 కోట్లు ఏపీ సంచిత ఖాతాలో ఉన్నాయి. ఇవి తెలంగాణకు రావాల్సి ఉంది. 13వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా రూ.1,132 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.  
బయటి ఆస్తుల పంపిణీ: ఉమ్మడి ఏపీ బయట ఉన్న ఏకైక ఆస్తి ఢిల్లీలోని ఏపీ భవన్‌ ఒక్కటే. దీని పంపకానికి ఏపీ ఇచ్చిన రెండు ప్రతిపాదనలు తెలంగాణ పరిశీలనలో ఉన్నాయి. 
ఆస్తులు, అప్పుల పంపిణీ: ఆపరేషనల్‌ యూనిట్స్‌ను భౌగోళికత ఆధారంగా పంపిణీ చేయాలి. కేంద్ర హోం శాఖ ఇచ్చిన స్పష్టత ప్రకారం ప్రధాన కార్యాలయాలు ఏ ప్రాంతంలో ఉంటే ఆయా రాష్ట్రాలకే చెందుతాయి. అయితే ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీ ఫుడ్స్, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ సంస్థల విషయంలో ప్రధాన కార్యాలయం అనే పదానికి నిర్వచనం అవసరమవుతోంది. 
షెడ్యూలు 9 సంస్థలు: ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో కోసం సంస్థల విభజన ఇంకా పూర్తికాలేదు. మొత్తం 91 సంస్థలకు గాను 78 సంస్థల విభజనపై స్పష్టత వచ్చింది. 
ఏపీహెచ్‌ఎంఈఎల్‌: ఈ సంస్థలో సింగరేణి సంస్థకు 81.54 శాతం ఈక్విటీ ఉంది. సింగరేణిలో తెలంగాణకు 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. అయితే షీలాభిడే కమిటీ మాత్రం ఏపీహెచ్‌ఎంఈఎల్‌ సంస్థ ఏపీలో ఉన్నందున ఆ సంస్థ ఏపీకి చెందుతుందని సిఫారసు చేయడం చట్ట విరుద్ధం. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా