గొర్రెకు..గొర్రె!

18 Nov, 2017 03:01 IST|Sakshi

చనిపోయిన రాయితీ జీవాల స్థానంలో మరొకటి అందజేత

లబ్ధిదారునికి బీమా పరిహారం లేనట్లే

కలెక్టర్ల ఖాతాకు పరిహారం చెల్లింపు

రాష్ట్రంలో 53 వేల గొర్రెలు మృత్యువాత

సాక్షి, రంగారెడ్డి జిల్లా: వివిధ కారణాల వల్ల మరణించిన రాయితీ గొర్రెల స్థానంలో మళ్లీ గొర్రెలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.   ఈ ఏడాది రాష్ట్రవ్యా ప్తంగా 3.62 లక్షల లబ్ధిదారులకు 75 శాతం రాయితీపై ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేస్తున్న విషయం విదితమే. సుదూర ప్రాంతాల నుంచి వందల కిలోమీటర్ల మేర జీవాలను వాహనాల్లో తీసుకొస్తున్నారు. ఫలితంగా తీవ్ర అలసటతో మార్గమధ్యంలో, కాపరి వద్దకు వచ్చాక పలు రకాల రోగాల బారినపడటం, స్థానిక పరిస్థితులకు అల వాటు పడకపోవడం తదితర కారణాల వల్ల అధిక సంఖ్య లో గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా కాపరులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రతి గొర్రెకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించినప్పటికీ.. దాని ఫలాలు అందుతాయో లేవోనన్న బెంగ లబ్ధిదారులను తొలుత వెంటాడింది.

బీమా పరిహారంగా నగదు చెల్లిస్తారని కాపరులు భావించారు. అయితే బీమా పరిహారం నేరుగా లబ్ధిదారునికి చెల్లిస్తే.. ఇతర ఖర్చులకు వినియోగించుకునే అవకాశం లేకపోలేదు. తద్వారా ఆర్థిక పరిపుష్టి కలగాలన్న సదుద్దేశం గాడి తప్పే ప్రమాదం లేకపోలేదు. దీనిపై నిశితంగా ఆలోచించిన సర్కారు.. చనిపోయిన గొర్రె స్థానంలో మరో గొర్రెను అంద జేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాగా, సుమారు 53 వేల గొర్రెలు చనిపోయినట్లు పశు సంవర్థక శాఖాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రాయితీ గొర్రె మరణం వాస్తవమేనని కంపెనీ నిర్ధారించుకున్న తర్వాత అందుకు సంబంధించిన బీమా పరిహారాన్ని జిల్లా కలెక్టర్‌ ఖాతాలో బీమా కంపెనీ జమ చేస్తుంది. ఈ మొత్తంతో సదరు లబ్ధిదారునికి మరొక గొర్రె కొనుగోలు చేసి అందజేస్తారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో చనిపోయిన వెయ్యి గొర్రెల వివరాలను బీమా కంపెనీకి అందజేయగా.. ఇందులో 34 క్లెయిమ్స్‌కు ఆమోదం లభించింది. 

మరిన్ని వార్తలు