ఫీజు బకాయిలుండవు

8 Dec, 2019 01:41 IST|Sakshi

ఇకపై కాలేజీలకు ఫీజు బకాయిలు ఉండొద్దని ప్రభుత్వ నిర్ణయం

2013–14 నుంచి 2017–18 వరకు ఉన్న రూ. 287.26 కోట్ల బిల్లులకు వచ్చే నెల ఆమోదం

జనవరి 31లోగా చెల్లించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు  

సాక్షి, హైదరాబాద్‌: కాలేజీ యాజమాన్యాలకు శుభవార్త. గత కొన్నేళ్లుగా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిల చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచి 2017–18 విద్యా సంవత్సరం వరకు ఉన్న బకాయిలను పూర్తిస్థాయిలో క్లియర్‌ చేయాలని నిర్ణయించింది. ఇకపై ఫీజు బాకీ అనేది లేకుండా ప్రతి కాలేజీకీ విడుదల కావాల్సిన నిధులను పైసాతో సహా ఇవ్వనుంది.

ఐదేళ్ల బకాయిలు రూ. 287.26 కోట్లు...
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద ఇవ్వాల్సిన నిధులను ప్రభుత్వం ఏటా విడుదల చేస్తున్నప్పటికీ సాంకేతిక కారణాలు, బిల్లుల క్లియరెన్స్‌లో జాప్యం తో ప్రతి సంవత్సరం నూరు శాతం చెల్లింపులు జరగడం లేదు. ఏటా ఒకట్రెండు శాతం నిధులు విడుదల కాకపోవడం... తర్వాత ఏడాదిలో వాటికి మోక్షం లభించకపోవడంతో బకాయిలుగా మారు తున్నాయి. 2013–14 విద్యా సంవత్సరం నుంచి 2017–18 విద్యా సంవత్సరం వరకు రూ. 287.26 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం... వాటిని ఒకేసారి విడుదల చేసి జీరో బ్యా లెన్స్‌ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కాలేజీలవారీగా పెండింగ్‌ బిల్లులను పరిశీలించాలని సంక్షేమ శాఖలను ఆదేశించింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన సంక్షేమాధికారులు ఆయా కాలేజీలకు సర్క్యులర్లు పంపేందుకు సిద్ధమవుతున్నారు. అలా కుదరకుంటే యాజమాన్యాలకు ఫోన్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు.

జనవరి 15 డెడ్‌లైన్‌...
కాలేజీల యాజమాన్యాలకు ఫీజు బకాయిలున్నట్లు తేలితే సంబంధిత బిల్లులను తక్షణమే సంబంధిత జిల్లా సంక్షేమ శాఖాధికారులకు సమరి్పంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత వారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వివిధ సంక్షేమ శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో బకాయిలను ఎట్టిపరిస్థితుల్లో ఆపొద్దని, వాటిని వెంటనే చెల్లించాలని నిర్ణయించడంతో ఈ మేరకు చర్యలు వేగవంతమయ్యాయి. ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌కాపీలతోపాటు హాడ్‌కాపీలను వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సమరి్పంచాలి.

అలా సమర్పించిన బిల్లులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సంక్షేమ శాఖలకు స్పష్టం చేసింది. గడువులోగా వచి్చన బిల్లులను పరిశీలించి జనవరి 31 నాటికి క్లియర్‌ చేయాలని ఆదేశించింది. జనవరి 15లోగా బిల్లులు సమరి్పంచకుంటే ఆయా కాలేజీలకు ఫీజు బకాయిలు విడుదల కష్టం కానుంది. ఎందుకంటే 2017–18 వార్షిక సంవత్సరం వరకు చెల్లింపులు చేసే ఆప్షన్‌ను జిల్లా సంక్షేమశాఖాధికారుల లాగిన్‌ ఐడీ నుంచి ప్రభుత్వం తొలగించనుంది. దీంతో ఆ బకాయిలు విడుదల కావాలంటే కాలేజీలు నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుందని ఎస్సీ అభివృద్ధిశాఖ సంచాలకుడు పి.కరుణాకర్‌ ‘సాక్షి’కి చెప్పారు.

ఫిబ్రవరి తర్వాతే 2018–19 చెల్లింపులు...!
2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తుల పరిశీలన ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటివరకు 77 శాతం దరఖాస్తులను పరిశీలించినట్లు తెలుస్తోంది. గత విద్యా సంవత్సర ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డిమాండ్‌ రూ. 2,101.45 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు రూ. 941.05 కోట్లు చెల్లించగా ఇంకా రూ. 1,164.4 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఫిబ్రవరి నుంచి ఈ చెల్లింపులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు