ఎస్‌హెచ్‌జీలకు మాస్కుల తయారీ కాంట్రాక్టు

7 Apr, 2020 02:58 IST|Sakshi

బాధ్యతలు అప్పగించిన పురపాలక శాఖ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో మున్సిపల్‌ ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బంది, పోలీసుల రక్షణకు పెద్ద ఎత్తున మాస్కుల తయారీ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక మహిళా సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) అప్పగించింది. మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్, రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ఆదివారం, సోమవారం పలు దఫాలుగా మున్సిపల్‌ కమిషనర్లు, మెప్మా మిషన్‌ కో–ఆర్డినేటర్లతో మాస్కుల తయారీపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ ని బంధనలకు లోబడి సామాజిక దూరం పాటించడంలో భాగంగా కొత్త టెక్నాలజీని (జూమ్‌ యాప్‌) ఉపయోగించి అధికారులు వారి ఇంటి నుంచే మొబైల్‌ ఫోన్‌ లేదా కంప్యూటర్‌ వెబ్‌ కెమెరా ద్వారా దాదాపు 300 మంది అధికారులతో (కమిషనర్లు, మెప్మా అధికారులు) డైరెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్వయం సహాయ సంఘాల మహిళలు ఇంటి వద్దే తమ వద్ద ఉన్న కుట్టు మెషీన్ల ద్వా రా యుద్ధ ప్రాతిపదికన 3 లక్షల మాస్క్‌ ల తయారీకి ఆదేశించారు. ఒక మాస్క్‌ తయారీకి అయ్యే ఖర్చును కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.14 చొప్పున కొనుగోలు చేసేందుకు మున్సిపల్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ పరిపాలన అనుమతులు ఇచ్చారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో విధులు నిర్వహించే మున్సిపల్, పోలీసు, వీధి విక్రయదారులు తప్పక మాస్క్‌ ధరించాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు