టెండర్ల ద్వారా గొర్రెల పంపిణీ 

18 Mar, 2019 02:51 IST|Sakshi

సర్కారు పరిశీలనలో ఉందంటున్న పశుసంవర్ధకశాఖ

సాక్షి, హైదరాబాద్‌: గొర్రెల కొనుగోళ్లలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం పశువైద్యుల సాయంతో లబ్ధిదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి గొర్రెలు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అవి నీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో టెండర్‌ ప్రక్రియ ద్వారా గొర్రె లను కొనుగోలుచేసి, గొల్ల కుర్మలకు పంపిణీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే నేరుగా లబ్ధిదారులకే సొమ్మును జమ చేసి గొర్రెలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించే అంశంపైనా కూడా పరిశీలన చేస్తోంది. ఈ రెండింటిలో ఏదో ఒక పద్ధతిని అవలంబిస్తే క్షేత్రస్థాయిలో పెద్దఎత్తున జరుగుతున్న రీసైక్లింగ్‌ను నివారించడంతోపాటు, పశువైద్యుల అక్రమాలకు తాళం వేసినట్లవుతుందని భావిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 75.95 లక్షల గొర్రెలను కొనుగోలు చేసినట్లు గొర్రెల, మేకల అభివృద్ధి సమాఖ్య గణాంకాలు చెబుతున్నాయి.

అయితే కొనుగోలు చేసి పంపిణీ చేసిన గొర్రెలనే నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ కొనుగోలు చేసినట్లు చూపి పంపిణీ చేయడంతో గొర్రెలు యథేచ్ఛగా రీసైక్లింగ్‌ అయినట్లు తేలింది. కొందరు పశువైద్యులు అమ్మకందారులతో కుమ్మక్కై అక్రమంగా వ్యవహరించారు. ఈ క్రమంలో గొర్రెలు గ్రౌండింగ్‌ చేయకున్నా చేసినట్లు చూపారు. దీంతో ఆరుగురు పశువైద్యులను సస్పెండ్‌ కూడా చేశారు. అయినప్పటికీ పశువైద్యులు బాధ్యతరాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని ఆ శాఖలోని అధికారులే విమర్శలు చేస్తున్నారు. ఫలితంగానే టెండర్‌ లేదా నేరుగా లబ్ధిదారుడి ఖాతాకు సబ్సిడీ రూపంలో డబ్బు జమచేసి గొర్రెలు కొనుగోళ్లు చేసేలా ప్రభుత్వం ఆలోచిస్తుంది.  

సరఫరా గొర్రెలపై సర్వే... 
2018 జూన్‌లో సీఎం కేసీఆర్‌ గొర్రెల అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంపై పశుసంవర్థక శాఖ సర్వే చేపట్టింది. ఏయే గ్రామాల్లో ఎన్ని యూనిట్లు పంపిణీ చేశారు. వాటిలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి. ఎన్నింటిని అమ్ముకున్నారు. ఎందుకోసం విక్రయించుకోవాల్సి వచ్చిందనే కారణాలతో ఈ సర్వే చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు