విద్యుత్‌ సమస్యలకు చెక్‌

25 Sep, 2019 09:02 IST|Sakshi

సాక్షి, కొత్తపల్లి : ఏళ్లనాటి విద్యుత్‌ సమస్యలకు ఇప్పుడిప్పుడే మోక్షం లభిస్తోంది. ప్రత్యేక నిధుల్లేక ప్రస్తుతం ఉన్న పనులకే మరమ్మతులు చేస్తుండగా.. గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ సమస్యలకు చెక్‌ పడుతోంది. విద్యుత్‌ స్తంభాలు కావాలని, విద్యుత్‌ లైన్లు వేలాడుతున్నాయని, విద్యుత్‌ స్తంభాలు వంగాయని, లో ఓల్టేజీ వస్తోందని, మీటర్లు అమర్చాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని తరచూ అధికారుల చుట్టూ తిరిగి వేసారిన ప్రజలకు ‘పవర్‌ వీక్‌’ రూపంలో రాష్ట్ర ప్రభుత్వమే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు విద్యుత్‌ అధికారులు సమస్యలపై నడుం బిగించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మూడు నెలల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశాలిచ్చారు. ఇదిలా కొనసాగుతుండగానే గ్రామాల్లో ఈ నెల 6 నుంచి చేపట్టన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విద్యుత్‌ సమస్యలనూ అధికారులు గుర్తించారు. ఆ సమస్యల పరిష్కారమే మార్గంగా ముందుకు సాగుతున్నారు. దీంతో గ్రామాల్లో కొంతమేర విద్యుత్‌ ప్రమాదాలకు చెక్‌ పడనుంది. 

ప్రత్యేక నిధుల్లేక కొత్త పనులకు బ్రేక్‌..
జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కొత్త స్తంభాలు, కొత్త లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వేయాల్సిన అవసరం ఉంది. విద్యుత్‌ డిమాండ్‌ను బట్టి విద్యుత్‌ మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు విడుదల కాకపోవడంతో ప్రస్తుతం కొత్త పనుల జోలికి అధికారులు వెళ్లడం లేదు. స్థానికంగా పరిష్కారమయ్యే పనులనే ప్రస్తుతం చేపడుతూ కొంతమేర విద్యుత్‌ ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంతో పోలిస్తే గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా మెరుగుకానుంది.

అనేక గ్రామాల్లో వంగిన స్తంభాలు, వేలాడుతున్న వైర్లు, మధ్య స్తంభాలు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, ఎర్తింగ్‌ లేని ట్రాన్స్‌ఫార్మర్లు, తుప్పు పట్టిన ఇనుప స్తంభాలు తదితర సమస్యలను అధికారులు గుర్తించారు. తుప్పు పట్టిన స్తంభాలను మాత్రమే తొలగించనున్నారు. ఇనుప స్తంభాలు బాగుంటే వాటినే కొనసాగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం వీటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. 

మెటీరియల్‌ కొరత..
విద్యుత్‌ మెటీరియల్‌ లేక పనుల్లో కొంత జాప్యం జరుగుతోంది. విద్యుత్‌ స్తంభాల కొరత, కాసారాలు, కండక్టర్లు, హెడ్జ్‌ ఫ్యూజుల కేబుళ్లు అందుబాటులో లేక పనులు ఆలస్యం అవుతున్నాయి. విద్యుత్‌ సమస్యలకు అనుగుణంగా ప్రభుత్వం మెటీరియల్‌ను సరఫరా చేస్తే గ్రామాల్లో త్వరలోనే విద్యుత్‌ సమస్యలు తొలగిపోనున్నాయి. 

విద్యుత్‌ బకాయిలపై ప్రత్యేక దృష్టి
పనిలో పనిగా విద్యుత్‌ బకాయిలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మరమ్మతు పనులు చేపడుతూనే.. బకాయిలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ పంచాయతీల విద్యుత్‌ బకాయిలను ఇకపై తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంది. గ్రామ పంచాయతీలే విద్యుత్‌ బకాయిలు చెల్లిస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన దరిమిలా విద్యుత్‌ అధికారులు బకాయిలపై దృష్టి సారించారు. స్థానికంగానే బకాయిలను వసూలు చేసేందుకు అధికారులు ఒత్తిడి తీసుకురానున్నారు. కరీంనగర్‌ జిల్లాలోని 324 గ్రామ పంచాయతీల్లో రూ.1.66 కోట్ల బకాయి డిమాండ్‌ను వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. లేనిపక్షంలో సంస్థ మనుగడకే ప్రమాదముందన్న ఆలోచనతో అధికారులు ముందుకు సాగనున్నారు. 

గ్రామ పంచాయతీలు : 324
విద్యుత్‌ పనులు పూర్తయిన గ్రామాలు : 30 
పనులు ప్రారంభించిన గ్రామాలు : 124

గుర్తించిన లూజ్‌ వైర్లు : 2,466 కిలోమీటర్లు
సరిచేసిన లూజ్‌ వైర్లు : 1430 కిలోమీటర్లు

వంగిన స్తంభాలు : 1228
సరిచేసిన స్తంభాలు : 493

అవసరమైన మధ్య  స్తంభాలు : 3899
వేసిన మధ్య స్తంభాలు : 1142

గుర్తించిన ఇనుప స్తంభాలు : 1548
వేసిన ఇనుప స్తంభాలు : 359

ఏబీ కేబుల్‌ వైర్లు : 307 కిలోమీటర్లు
వేసిన కేబుల్‌ వైర్లు : 55 కిలోమీటర్లు

గుర్తించిన థర్డ్‌ వైరు : 269 కిలోమీటర్లు
వేసిన థర్డ్‌ వైరు : 113 కిలోమీటర్లు

గుర్తించిన ఫిఫ్త్‌ వైరు : 35 కిలోమీటర్లు
వేసిన ఫిఫ్త్‌ వైరు : 3.5 కిలోమీటర్లు 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా