నిధులు లేవు.. అభివృద్ధి పనులు జరగవు

11 Oct, 2019 12:55 IST|Sakshi
ప్రారంభానికి నోచుకోని పీజీ విద్యార్థుల హాస్టల్‌ భవనం

ఓయూకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధుల్లోభారీకోత

ఏడాదికి రూ.600 కోట్లు అవసరం

ప్రభుత్వం కేటాయించింది రూ.309 కోట్లే

ఉన్న నిధులు సిబ్బంది వేతనాలు, పెన్షన్లకే చాలవు   

మూడేళ్లుగా నిలిచిన అభివృద్ధి పనులు

తరచుగా రోడ్డెక్కుతున్న విద్యార్థులు

ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర ప్రభు త్వం ఓయూకు కేటాయించే బ్లాక్‌గ్రాంట్స్‌ నిధుల్లో సగానికి సగం కోత విధించడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయా యి. బ్లాక్‌గ్రాంట్స్‌ నిధులను వేతనాలు, పించన్లతో పాటు అభివృద్ధి పనులకు ఉపయోగిస్తారు. గత మూడేళ్లులుగా అభివృద్ధి నిధులను నిలిపివేయడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అడిగినన్ని నిధులు విడుదల చేయనందున వివిధ వనరుల ద్వారా ఓయూకు లభించే ప్రతి పైసా ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు వినియోగిస్తున్నారు. ఓయూ ఉద్యోగుల వేతనాలు, పించన్లకు ప్రతి నెలా రూ.30 కోట్లు, ఏడాదికి రూ.584 కోట్లు అవసరం. ఇందుకోసం ఓయూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.600 కోట్లు బ్లాక్‌గ్రాంట్స్‌ నిధులు అడుగుతున్నారు.కానీ ప్రభుత్వం రూ.309 కోట్లను మాత్రమే విడుదల చేస్తోంది. ఈ నిధులు సరిపోకపోవడంతో మిగతా నిధులను ఓయూ సమకూర్చుకోవాల్సి వస్తున్నది. ఓయూకు వివిధ వనరుల ద్వారా లభించే ఆదాయాన్ని అభివృద్ధికి వినియోగించకుండా వేతనాలు, పించన్లకు వాడుతున్నారు. దీంతో ఓయూలో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి.

తగ్గుతున్న ఓయూ ఆదాయం
ఓయూకు వివిధ వనరుల ద్వారా లభించే ఆదాయం ప్రతి ఏటా తగ్గుతుంది. గతంలో పీజీ అడ్మిషన్స్‌ కార్యాలయం, దూరవిద్యా కేంద్రం, విదేశీ విద్యార్థులు, ఎగ్జామినేషన్‌ బ్రాంచ్, క్రీడా మైదానాలు తదితరాల నుంచి కోట్లాది రూపాయాల ఆదాయం లభించేంది. ఈ ఆదాయాన్ని ఓయూలో వివిధ రకాల అభివృద్ధి పనులకు ఉపయోగించేవారు. తెలంగాణలో కొత్త వర్సిటీల రాకతో ఓయూకు ఆదాయం తగ్గింది. దీంతో ఉన్న నిధులు వేతనాలు, పించన్ల చెల్లింపులకే ఉపయోగిస్తున్నారు.

మౌలిక వసతులు లేక నిలిచిన హాస్టల్‌ భవన ప్రారంభోత్సవం
ఓయూ క్యాంపస్‌ ఐపీఈ ఎదురుగా 500 మంది పీజీ విద్యార్థుల వసతి కోసం పెద్ద హాస్టల్‌ భవనాన్ని నిర్మించారు. కానీ అందులో ఫర్నీచర్, మంచాలు (బెడ్స్‌) వంట సామాన్లు, ఫ్యాన్లు, టేబుల్స్, కుర్చీలు ఇతర మౌలిక వసతులు, సౌకర్యాలను కల్పించేందుకు నిధులు లేకపోవడంతో  భవనం ప్రారంభానికి నోచు కోకుండా పోయింది. హాస్టల్‌ గదుల కొరతతో విద్యార్థులు నిత్యం రోడెక్కి ఆందోళనలు చేస్తున్నారు. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మించిన మెగా హాస్టల్‌ భవనంలో వసతులు లేక ఉత్సవ విగ్రహంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా అభివృద్ధి గ్రాంట్స్‌ను పూర్తిగా నిలిపి వేసింది. ప్రస్తుతం ఓయూకు లభించే ప్రతి పైసాను నిబంధనలకు విరుద్ధంగా బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, పించన్ల చెల్లింపునకు ఉపయోగిస్తున్నారు. ఓయూకు నిధులు తగ్గడం, ప్రభుత్వం నుంచి లభించే బ్లాక్‌గ్రాంట్స్‌లో కోత విధించడంతో ప్రతి నెలా వేతనాల చెల్లింపు సవాల్‌గా మారి విద్యార్థుల అభివృద్ధికి కోసం వాడాల్సిన నిధులను సైతం వేతనాలు, పించన్ల చెల్లింపునకు ఉపయోగిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా