ఐఏఎస్‌ అయ్యింది.. ఐపీఎస్‌ ఆగింది

29 Jan, 2018 02:37 IST|Sakshi

వారం క్రితమే రాష్ట్రానికి 

కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ల జాబితా 

ఐపీఎస్‌ల జాబితా ఇంకా జీఏడీలోనే..

సాక్షి, హైదరాబాద్‌: కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ అధికారుల జాబితా కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం నుంచి వారం క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. కానీ కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ల జాబితా మాత్రం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లోనే మూలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పోలీస్‌ శాఖ 20 రోజుల క్రితం కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ అధికారుల జాబితాను జీఏడీకి పంపింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు ఆ జాబితా ఎక్కడుంది? ఎందుకు పెండింగ్‌లో ఉంది? అనే విషయంపై స్పష్టత కరువైంది. ఇప్పటికే నాలుగేళ్లుగా ప్యానల్‌ జాబితా హస్తిన చేరక ఐపీఎస్‌ల కొరత ఏర్పడింది. సీనియారిటీ సమస్యతో పెండింగ్‌లో పడుతూ వస్తోంది. తీరా జాబితా తెప్పించుకొని రోజులు గడుస్తున్నా ఎందుకు పెండింగ్‌లో ఉందో పోలీస్‌ శాఖ సరైన కారణం చెప్పలేకపోతోంది.  

అన్నీ ఉన్నా.. 
డీఎస్పీల సీనియారిటీ సమస్యలతో కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ ప్రతిపాదనలు ఆలస్యమవుతూ వస్తున్నాయి. కానీ కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ పదోన్నతికి సీనియారిటీతో సమస్య లేదన్న వాదన వినిపిస్తోంది. గ్రూప్‌–1 నుంచి డీఎస్పీలుగా ఎంపికైనా అధికారులు కనీసం 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి కచ్చితమైన ఖాళీ పోస్టులో పనిచేస్తూ ఉంటే కన్ఫర్డ్‌ ఐపీఎస్‌కు పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే ఎలాంటి అడ్‌హాక్‌ పదోన్నతిపై పనిచేయకుండా ఉన్న అధికారుల జాబితానూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 2007 బ్యాచ్‌ అధికారులు కచ్చితమైన సీనియారిటీ, ఖాళీ పోస్టులోనే పనిచేస్తున్నారు. అయినా జాబితా పెండింగ్‌లో ఉంచడం వెనుక కారణాలేంటని పోలీస్‌ శాఖలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఎస్పీ స్థాయి అధికారుల కొరత తీవ్రంగా ఉన్నందున ఉన్నతాధికారులు త్వరితగతిన జాబితాను హస్తినకు పంపించాలని సొంత శాఖ నుంచే డిమాండ్‌ వినిపిస్తోంది. 

మరిన్ని వార్తలు