కోవిడ్‌ ముట్టఢీ రాష్ట్రాల కట్టఢీ

26 Mar, 2020 03:35 IST|Sakshi

వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రాల చర్యలు 

ముందు జాగ్రత్తలు.. కఠిన నిర్ణయాల అమలు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కోవిడ్‌ రోజురోజుకూ విస్తరిస్తుంది. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో 11 మంది చనిపోయారు. దీంతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. పాజిటివ్‌ రోగుల సంఖ్య పెరగడంతో కోవిడ్‌ వ్యాపించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. కోవిడ్‌ అధికంగా ఉన్న రాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాలూ కోవిడ్‌ కట్టడికి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. హోం క్వారంటైన్‌లో ఉన్న వారి కదలికలు కనిపెట్టేందుకు కర్ణాటక సర్కా రు ఫోన్‌ ద్వారా ట్రాక్‌ చేస్తోంది. ఒకటి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలను ఒడిశా ప్రభుత్వం రద్దు చేసింది. ఇక మృతుల బంధువులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పరిహారం అందజేయాలని బిహార్‌ సర్కారు నిర్ణయించింది. ఇంకా ఏయే రాష్ట్రాలు ఏ చర్యలు తీసుకుంటున్నాయంటే..

ఢిల్లీ: బియ్యం, భోజనం ఉచితం
- రైళ్లు, విమానాలు, పబ్లిక్, ప్రైవేట్‌ బస్సులు బంద్‌. డీటీసీలోని 50 శాతం బస్సులు అత్యవసర సేవలకు వినియోగం.
- నిర్మాణ పనులు బంద్‌. నిత్యావసర వస్తువులు విక్రయించే కొన్ని మినహా మిగతా అన్ని మార్కెట్లు, దుకాణాలు, పరిశ్రమల బంద్‌.
- సెక్షన్‌ 144 విధింపు. ఒకచోట పెద్దసంఖ్యలో గుమిగూడటం నిషేధం. అన్ని మత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలపై నిషేధం.
- జామియా, జేఎన్‌యూ విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోవాలని ఆదేశాలు. ఐఐటీ ఢిల్లీ తరగతుల రద్దు.
- 72 లక్షల మంది పేదలకు ఏడున్నర కిలోల చొప్పున బియ్యం ఉచితం. 8.5 లక్షల మందికి రూ.4 వేల నుంచి రూ.5వేల పెన్షన్‌.
- నైట్‌షెల్టర్లలో అందరికీ ఉచిత భోజనం.
- లాక్‌డౌన్‌ సమయంలో వేతనాల్లో కోత విధించకూడదని ఆదేశాలు.
- క్వారంటైన్‌ వ్యక్తులు నివసిస్తున్న ఇళ్ల మార్కింగ్‌.

యూపీ: పేదలకు ‘రిలీఫ్‌’
- క్కువమంది గుమికూడకుండా చర్యలు. నిరంతరం పెట్రోలింగ్‌.
- నోయిడా, గ్రేటర్‌ నోయిడాలో స్విమ్మింగ్‌ పూల్స్‌ మూసివేత, బహిరంగ కార్యక్రమాలు, మత, రాజకీయ సమావేశాలు ఏప్రిల్‌ 15 వరకు నిషేధం.
- ప్రజలకు అవసరమైన సరుకులు, సాయం అందించడానికి పోలీసు వాహనాల వినియోగం.
- కోవిడ్‌ పాజిటి వ్‌ వచ్చిన వారికి ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించి, చికిత్సకయ్యే మొత్తాన్ని భరిస్తుంది.
- ఆరోగ్య సేవలకు 108, 102 అంబులెన్సులు.. ఎమర్జెన్సీ వైద్య సేవలకు 250 అడ్వాన్స్‌ లైఫ్‌ స పోర్ట్‌ అంబులెన్సులు..
- ఉపాధి కూలీలు, అం త్యోదయ కార్డుదారులకు, పేదలకు రిలీఫ్‌ ప్యాకేజీలు.. దినసరి కూలీలకు నిర్ధారిత మొత్తం అందజేత.
- ఉద్యోగులు వీలైనంత వరకు ఇళ్ల నుంచే పనిచేయాలని ఆదేశాలు. ప్రభుత్వోద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరు నుంచి మినహాయింపు.
- 1 నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు విద్యార్థులు.

మహారాష్ట్ర: చికిత్స కేంద్రాల పెంపు
- సినిమా హాళ్లు, జిమ్, పార్కులు మూసివేత. మాల్స్, సినిమా హాళ్లు మార్చి 31 వరకు బంద్‌.
- బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, మందులు, నిత్యావసరాల దుకాణాలు ఓపెన్‌.
- రాష్ట్ర, అన్ని జిల్లాల సరిహద్దుల మూసివేత. రైళ్లు, ప్రజా రవాణా, ప్రైవేటు సర్వీసుల రద్దు. అత్యవసర సేవలకు సిటీ బస్సుల వినియోగం.
- ప్రభుత్వ కార్యాలయాల్లో 5 శాతం ఉద్యోగులే పనిచేయాలి.
- వైరస్‌ టెస్టింగ్, చికిత్స సెంటర్ల సంఖ్య పెంపు.
- ముంబై, పుణే, నాగ్‌పూర్‌ సహా మహారాష్ట్రలోని అన్ని నగరాల్లో 144 సెక్షన్‌ అమలు.
- 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షల వాయిదా. 10, 12 పరీక్షలు యథాతథం. ఐఐటీ బాంబే విద్యార్థులు క్యాంపస్‌ ఖాళీ చేయాలని ఆదేశాలు.

రాజస్తాన్‌:    పూర్తిగా లాక్‌డౌన్‌
- జైపూర్, జోధ్‌పూర్‌ స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారా లు వాయిదా. అత్యవసర సేవ లు మినహా పూర్తిగా లాక్‌డౌన్‌.
- పేదలకు మే నెల వరకు ఉచితంగా గోధుమల పంపిణీ.
- వీధి వ్యాపారులు, రోజుకూలీల కుటుంబాలకు ఏప్రిల్‌ 1 నుంచి రెండు నెలల వరకు ఉచితంగా నిత్యావసరాలు.
- అత్యవసర సేవలు మినహా ప్రైవేటు ఆఫీసులు, మాల్స్, షాపులు, ఫ్యాక్టరీలు, రవాణా, స్కూళ్లు మూసివేత.

ఛత్తీస్‌గఢ్‌: ‘అత్యవసరాలు’ మాత్రమే
- నగరాల్లో లాక్‌డౌన్‌. అన్ని కార్యాలయాలు, రవాణా సేవలు, మిగతా కార్యకలాపాలు రద్దు.
- అత్యవసర, నిత్యావసర సేవలు అందుబాటులోనే ఉంటాయి.
- కరెంట్, తాగునీరు, వంటగ్యాస్‌ సరఫరా, పారిశుధ్యం, నిత్యావసరాలు, కమర్షియల్‌ గూడ్స్‌ రవాణా సేవలు కొనసాగుతాయి.

పశ్చిమబెంగాల్‌: విద్యాసంస్థల మూత
- అత్యవసర, నిత్యావసర సేవలన్నీ కొనసాగింపు.
- అన్ని రకాల విద్యాసంస్థలన్నీ ఏప్రిల్‌ 15 వరకు మూసివేత. బోర్డ్‌ పరీక్షలు యథాతథం.

బిహార్‌: సీఎం ‘నిధి’ పరిహారం
- ఇక్కడ ఆదివారం మొదటి కోవిడ్‌ మృతి కేసు నమోదైంది. అంతర్రాష్ట్ర రవాణా పూర్తిగా నిలిపివేత. బస్సులు ఎప్పటికప్పుడు శుభ్రం.
- జిల్లా హెడ్‌క్వార్టర్స్, నగర పంచాయతీలన్నింటిలో లాక్‌డౌన్‌ అమలు. కోచింగ్‌ సెంటర్లు, సినిమా హాళ్లు, పబ్లిక్‌ పార్కులు మూసివేత.
- మృతుల బంధువులకు సీఎం సహాయనిధి నుంచి పరిహారం.
- పాట్నా హైకోర్ట్‌ అత్యవసర కేసుల కోసమే పనిచేస్తుంది.

ఉత్తరాఖండ్‌:   కూలీ ఖాతాల్లో రూ.1,000
- రాష్ట్రంలో రిజిస్టర్‌ చేసుకున్న కూలీల ఖాతాల్లో రూ.1,000 జమ. అత్యవసర సేవలు మినహా మిగతా అన్నిటిపై నిషేధం.
- ఆహార, ఆరోగ్య అవసరాలపై దృష్టి.. ఇంటింటికీ వెళ్లి సరుకులు, మందులు అందజేత.

ఒడిశా: ఆదేశాలు పాటించకుంటే కేసులు
- అన్ని విద్యాసంస్థలూ ఏప్రిల్‌ 15 వరకు బంద్‌. పూరీ బీచ్, కోణార్క్‌ సూర్య మందిరం, చిలక సరస్సు, చంద్రభాగా బీచ్‌ మూసివేత.
- 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షల రద్దు. యూనివర్సిటీల సెమిస్టర్స్‌ వాయిదా.
- ప్రభుత్వ ఆదేశాలు పాటించని వారిపై ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు.

మధ్యప్రదేశ్‌: పేదలకు రేషన్‌
- భోపాల్, జబల్పూర్‌లో పేద కుటుంబాలకు రేషన్‌ షాపుల ద్వారా ఈ నెల సరుకులు ఉచితంగా పంపిణీ.
- ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయంలో భక్తులకు ప్రవేశం నిషేధం.

తమిళనాడు: సరిహద్దులు బంద్‌
- అన్ని స్కూళ్లు, కాలేజీలు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, థియేటర్లు, స్విమ్మింగ్‌పూల్స్‌ మూసివేత. ప్రజా రవాణా రద్దు.
- 10, 12 తరగతుల పరీక్షలు కొనసాగుతాయి.
- కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ సరిహద్దుల మూత.
- రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ. మతపర కార్యక్రమాలు, కాన్ఫరెన్స్‌లు, బహిరంగ సభలపై నిషేధం.

కర్ణాటక: నిఘాలో ‘క్వారంటైన్‌’
- హోం క్వారంటైన్‌లో ఉన్న వారి కదలికలు ఫోన్‌ ద్వారా ట్రాకింగ్‌.
- షాపింగ్‌ మాల్స్, బార్ల మూసివేత మరో పది రోజుల పొడిగింపు.
- కోవిడ్‌ నియంత్రణ చర్యలకు రూ.200 కోట్ల సహాయ నిధులు విడుదల. 

కేరళ: పరీక్షలకు ఓకే
- 1 నుంచి 7వ తరగతి వరకు సీబీఎస్‌ఈ, ఐసీ ఎస్‌ఈ బోర్డ్‌ స్కూళ్లు మూత.
- పది, పన్నెండో తరగతి పరీక్షలు కొనసాగుతాయి.

జమ్మూకశ్మీర్‌: విదేశీయులకు ‘నో’
- విదేశీయులకు ప్రవేశంపై నిషేధం.
- రాంబాన్, కిష్త్‌ వాడ్‌ సహా కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు