బ్యాంకు‘బంధు’!

14 Nov, 2018 02:45 IST|Sakshi

1700 కోట్ల రూపాయలు

15 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసిన మొత్తం

రైతుబంధు సొమ్మును అప్పుల కింద జమేసుకుంటున్న బ్యాంకులు

దీన్ని అడ్డుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సర్కారు

అయినా పట్టించుకోని కేంద్రం.. బ్యాంకులకు ఏ ఆదేశాలివ్వని వైనం

పెట్టుబడి సొమ్ము వచ్చినా ప్రయోజనం లేదని వాపోతున్న రైతులు

బ్యాంకుల నిర్వాకంపై మండిపడుతున్న అధికార పార్టీ నేతలు

ఇటు ఎన్‌ఆర్‌ఐల ఖాతాల్లో ఖరీఫ్‌ చెక్కుల జమకు సన్నాహాలు  

సాక్షి, హైదరాబాద్‌: రైతుల పట్ల బ్యాంకులు ఏమాత్రం కనికరం చూపడం లేదు. తమ అప్పులను వసూలు చేసుకోవడంపైనే అవి దృష్టి సారించాయి. రబీ పెట్టుబడి సొమ్ము రైతు ఖాతాలో పడగానే, ఆ సొమ్మును వారి అప్పుల కింద జమ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రైతుబంధు సొమ్మును అలా అప్పుల కింద జమ చేసుకోవద్దని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కారు లేఖ రాసింది. అయినా కేంద్రం ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వడంలో విఫలమైంది.

రైతులకు కీలకమైన రబీ సీజన్‌లో పెట్టుబడి సొమ్ము ఉపయోగపడాల్సి ఉండగా, ఆ డబ్బును బ్యాంకులు అప్పుల కింద జమ చేసుకుంటుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం సరాసరి ప్రతీ రైతుకు రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకు రైతుబంధు కింద సొమ్ము అందుతుంది. ఆ సొమ్మును పాత బాకీల కింద వసూలు చేసుకుంటే రైతుకు మిగిలేది శూన్యమే. దీంతో ప్రభుత్వం అందజేసే రైతుబంధు సొమ్ము బ్యాంకులకు వరంగా మారిందన్న విమర్శలొస్తున్నాయి. అయితే ఎంతమంది రైతుల నుంచి పెట్టుబడి సొమ్మును బ్యాంకులు అప్పులుగా వసూలు చేశాయన్న వివరాలు తమకు అందలేదని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి.

15 లక్షల మంది రైతులు.. రూ.1,700 కోట్లు జమ..
ఖరీఫ్‌లో 52 లక్షల మంది రైతులకు రూ. 5,100 కోట్ల వరకు రైతుబంధు కింద ప్రభుత్వం మొదటిసారి పంపిణీ చేసింది. ఇంకా అనేకమంది ఎన్‌ఆర్‌ఐలకు, ఇతరులకు పెట్టుబడి చెక్కులు ఇవ్వాల్సి ఉండగా, వివిధ కారణాలతో అవి నిలిచిపోయాయి. ఇక రబీ సీజన్‌ కోసం పెట్టుబడి చెక్కులను వ్యవసాయశాఖ వర్గాలు ముద్రించాయి. అయితే ఎన్నికల కమిషన్‌ చెక్కుల పంపిణీ చేపట్టొద్దని, రైతు ఖాతాల్లోకే బదిలీ చేయాలని సూచించడంతో ఆ ప్రకారమే రైతుబంధును అమలు చేస్తున్నారు. సోమవారం నాటికి 15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,700 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి చెప్పారు. ఇంకా మిగిలిన రైతుల బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్నారు.

వారికి కూడా పెట్టుబడి సొమ్ము జమ చేయనున్నారు. అయితే అప్పుల కింద పెట్టుబడి సొమ్ము బ్యాంకులు జమ చేసుకుంటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పులున్న బ్యాంకు ఖాతాలు కాకుండా ఇతర బ్యాంకు ఖాతా నంబర్లు ఇవ్వాలని, ఒకవేళ లేకుంటే కొత్తగా మరో బ్యాంకు ఖాతా తెరవాలని వ్యవసాయ శాఖ రైతులను కోరింది. రైతుబంధు సొమ్మును బ్యాంకులు రైతు అప్పుల కింద జమ చేసుకుంటుండటంపై అధికార పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడితే బ్యాంకులు కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బంది పెట్టడమేంటని మండిపడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వాపోతున్నారు.

ఎన్‌ఆర్‌ఐల ఖాతాల్లో ఖరీఫ్‌ చెక్కుల జమకు సన్నాహాలు
ఇదిలాఉండగా ఇక్కడ భూమి కలిగి విదేశాల్లో ఉండే ఎన్‌ఆర్‌ఐలకు ఖరీఫ్‌లో చెక్కుల పంపిణీ జరగలేదు. ఎట్టకేలకు వారి అనుమతి మేరకు ఇక్కడి వారి కుటుంబ సభ్యులకు చెక్కులు ఇచ్చేలా సర్కారు ఆదేశాలు జారీచేసింది. అయితే ఎన్నికల సీజన్‌ మొదలు కావడంతో చెక్కుల పంపిణీని ఎన్నికల కమిషన్‌ నిలిపివేయడంతో ఎన్‌ఆర్‌ఐ చెక్కుల పంపిణీకి కూడా బ్రేక్‌ పడింది. అయితే ఆ చెక్కుల సొమ్మును సంబంధిత ఎన్‌ఆర్‌ఐ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఏ బ్యాంకు ఖాతాలో వేయాలో ఎన్‌ఆర్‌ఐలు తెలియజేస్తే ఆ ప్రకారం చేస్తామని వెల్లడించాయి. మొత్తం 63 వేల మంది ఎన్‌ఆర్‌ఐల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కానీ సమాచారం లేకపోవడంతో ఇప్పటివరకు ఎవరి ఖాతాల్లోకి రైతుబంధు సొమ్మును బదిలీ చేయలేదని అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు