184 ఎకరాల దేవుడి భూములు అన్యాక్రాంతమా? 

27 Jun, 2018 01:50 IST|Sakshi

పూర్తి వివరాలు ఇవ్వాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం.. 

సాక్షి, హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామంలో ఉన్న 308, 332, 333 సర్వే నంబర్లలోని 184 ఎకరాల దేవాదాయ భూమి అన్యాక్రాంతం కావడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. భూమిని ప్లాట్లుగా చేసి స్థానిక నేతలు  విక్రయిస్తుంటే ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

నిజాం పేటలోని సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి ఉన్న 184 ఎకరాల భూమి ని కొలన్‌ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలోని దేవస్థానం కమిటీ, స్థానిక సర్పంచ్, స్థానిక నేతలు కలసి ప్లాట్లు వేసి అమ్మేసి కోట్ల రూపాయలు గడించారంటూ కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్‌కు చెందిన అరుంధతమ్మ హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన న్యాయమూర్తుల పిల్‌ కమిటీ దీన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని సిఫారసు చేసింది. దీంతో ఏసీజే ఆదేశాల మేరకు హైకోర్టు రిజిస్ట్రీ ఆ లేఖను పిల్‌గా మలచింది. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 

మరిన్ని వార్తలు