స్టేట్ హోం అధికారులపై మంత్రి సీరియస్

5 Jun, 2015 04:15 IST|Sakshi
స్టేట్ హోం అధికారులపై మంత్రి సీరియస్

అధికారులకు, సిబ్బందికి షోకాజ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో స్టేట్ హోం అధికారుల పనితీరుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ తీరు బాగోలేదని, దీన్ని మార్చుకోవాలని వారిని హెచ్చరించారు. ఇక్కడికి వచ్చే అనాథలు, అభాగ్యులను సొంత బిడ్డల్లా చూసుకోవాలన్నారు. యువతులు వెళ్లిపోవడానికి సరైన కారణాలను తెలియజేయాలని అధికారులకు, సెక్యూరిటీ సిబ్బందికి అక్కడే షోకాజ్ నోటీసు జారీ చేశారు.

స్టేట్ హోం నుంచి గత బుధవారం 11 మంది యువతులు పారిపోయిన నేపథ్యంలో గురువారం మంత్రి దాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రెస్క్యూహోంతో పాటుగా స్టేట్‌హోం కూడా ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల తరచూ కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఈ రెండు విభాగాలను సాధ్యమైనంత త్వరలో వేర్వేరుగా ఉంచడానికి ప్రయత్నిస్తామన్నారు.

అంతకు ముందు పారిపోయి తిరిగి వచ్చిన నవ్య, స్రవంతితో మంత్రి మాట్లాడారు. నవ్య స్పందిస్తూ తన తల్లిని చూడాలని వెళ్లానని,  ఇక్కడ కొన్ని పనులను చేయలేకపోతున్నానని చెప్పింది.  తనను  తన తల్లివద్దకు పంపాలని కోరింది. దీంతో మంత్రి ఆమెను తల్లి వద్దకు పంపే ఏర్పాటు చేయాలన్నారు. స్రవంతి మాత్రం ఇకపై ఎక్కడకు వెళ్లనని  చెప్పింది.   
 
బందీలుగా ఫీలవుతున్నారు: ఇక్కడికి వచ్చిన వాళ్లు బందీలుగా భావిస్తున్నారు. ఎంత సెక్యూరిటీ ఉన్నా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని స్టేట్‌హోం ఇన్‌చార్జి డెరైక్టర్ ప్రశాంతి అన్నారు. సౌకర్యాలు తక్కువగా ఉన్నాయన్న మాట వాస్తవమేనని, వంటలు తదితర పనులు వాళ్లే చేసుకోవాల్సి వస్తున్నందున ఇబ్బందితో కూడా పారిపోయే అవకాశం ఉందన్నారు.
 
పోలీసుల అదుపులో మరో ఇద్దరు
స్టేట్ హోం నుంచి యువతులు పారిపోయిన ఘటనలో మరో ఇద్దరు బాలికలను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గ్‌కు చెందిన 17 ఏళ్ల బాలికను సంగారెడ్డి టౌన్‌లో గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడ వడ్డెర బస్తీకి చెందిన 18 ఏళ్ల బాలికను కూడా అమీర్‌పేటలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరిని స్టేట్‌హోంకు తరలించారు.

మరిన్ని వార్తలు