లెక్కలు తేల్చండి!

28 May, 2014 22:47 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో బ్యాంకర్లలో హడావుడి మొదలైoది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం రాజకీయ పార్టీల ప్రధాన బాధ్యత. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధమైంది. ‘రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ’ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ పేర్కొంది. తాజాగా ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టనుండడంతో.. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) రైతుల రుణాల లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రిన్సిపల్ బ్యాంకులకు మార్చి 31, 2014 నాటికి మంజూరు చేసిన రుణాల వివరాలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్షేత్రస్థాయిలో రైతులకిచ్చిన రుణాల వివరాలపై బ్యాంకు అధికారులు కుస్తీ మొదలుపెట్టారు.

 ఏ కేటగిరీ ఎంతెంత?
 రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించినప్పటికీ.. వాటికి సంబంధించిన నిబంధనలపై స్పష్టత కొరవడింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే రుణమాఫీ అమలుకు సంబంధించి పూరిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు సమాచార సేకరణ కష్టమైందని భావించిన బ్యాంకర్లు ముందస్తుగా వివరాలను తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా రైతులకు రెండు ప్రధాన విభాగాల్లో రుణాలిస్తారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోటాలో రుణాలిచ్చిన నేపథ్యంలో ఈ రెండు కేటగిరీల్లో ఇచ్చినవాటి లెక్కలు తేల్చుతున్నారు. ప్రస్తుతం జిల్లా గ్రామీణ పరిధిలో 360 బ్యాంకులున్నాయి. ఆయా బ్యాంకులవారీగా రుణ సమాచారం అందడానికి సమయం పట్టనుంది.

 పీఏసీఎస్‌ల ‘లెక్క తేలింది’
 ప్రధాన బ్యాంకుల రుణాలకు సంబంధించి రుణాల లెక్కలపై స్పష్టత రాలేదు. ఆయా బ్యాంకుల పని ఒత్తిడి, మరోవైపు లీడ్ బ్యాంక్ మేనేజర్ (ఎల్‌డీఎం) మారడంతో వివరాల అంశం కొలిక్కి రావడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. హైదరాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (హెచ్‌డీసీసీబీ) పరిధిలోని పరపతి సంఘాలు ఇచ్చిన రుణాల లెక్క కొలిక్కి వచ్చింది. హెచ్‌డీసీసీబీ పరిధిలో 49 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఉన్నాయి. వీటి పరిధిలో స్వల్పకాలిక రుణాల కోటాలో 53,394 మంది రైతులకు రూ.148.37కోట్ల రుణాలు మంజూరు చేశారు. దీర్ఘకాలిక రుణాల కోటాలో 16,295 మంది రైతులకు రూ.76.17కోట్లు ఇచ్చారు. నేరుగా 5.14కోట్ల రుణాలిచ్చారు. మొత్తంగా రూ. 229.68 కోట్ల రుణాలిచ్చారు. ఈ మేరకు వివరాలను ప్రభుత్వానికి సమర్పించినట్లు ఆ బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి కొండ్రు రాందాస్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు