నేరాల నియంత్రణకు ‘ఆన్‌లైన్‌’ మంత్రం!

31 Mar, 2018 03:15 IST|Sakshi
ఈ–పెట్టీ కేస్‌ యాప్‌ను ఆవిష్కరిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి (ఫైల్‌)

     టెక్నాలజీ విప్లవం తెచ్చిన రాష్ట్ర పోలీస్‌ శాఖ

     ఎఫ్‌ఐఆర్‌ నుంచి చార్జిషీట్‌ వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే

     సత్ఫలితాలనిస్తున్న ఈ–పెట్టీ కేస్‌ యాప్‌

     అన్ని వివరాలు చిటికెలో పొందేలా ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన శ్రీలక్ష్మి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. తన కాలనీకే చెందిన కొందరు యువకులు వేధిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ఆమె భయపడింది. రాష్ట్ర పోలీస్‌ శాఖ వెబ్‌సైట్‌ (www.tspolice.gov.in) గురించి తెలుసుకుని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన సైబరాబాద్‌ పోలీసులు.. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే ఫిర్యాదును పోలీసులు స్వీకరించినట్టు, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పేర్కొంటూ వివరాలు శ్రీలక్ష్మి మొబైల్‌కు సంక్షిప్త సందేశం వచ్చింది. అనంతరం పోలీసులు శ్రీలక్ష్మి ఇంటికి వెళ్లి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌ ద్వారా శ్రీలక్ష్మి తెలుసుకుంది.

క్షణాల్లో నమోదు.. 24 గంటల్లో విచారణ
రాష్ట్ర పోలీస్‌ శాఖ వెబ్‌సైట్‌ ద్వారా కేసులకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయగానే క్షణాల్లో ఫిర్యాదుదారు మొబైల్‌కు సంబంధిత ఫిర్యాదు నంబర్‌తోపాటు ఫిర్యాదు స్వీకరించినట్టు సంక్షిప్త సందేశం అందుతోంది. 24 గంటల్లోపు ప్రాథమిక విచారణ చేసి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నారు. తర్వాత ఫిర్యాదుదా రు మొబైల్‌కు ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ కూడా పంపుతున్నారు. ఎఫ్‌ఐఆర్‌ కావాలనుకున్న ఫిర్యాదుదారులు స్టేషన్‌ నుంచి లేదా వెబ్‌సైట్‌ ద్వారా పొందుతున్నారు. కేసుల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయన్న సమాచారాన్నీ వెబ్‌సైట్‌లో పోలీస్‌ శాఖ పొందుపరుస్తోంది. అదృశ్యమైన వ్యక్తుల వివరాలు, పిటిషన్‌ స్టేటస్, పాస్‌పోర్టు స్టేటస్, వాహనాల ఈ–చలాన్‌ స్టేటస్, అరెస్ట్‌ పర్టిక్యులర్‌ రిపోర్ట్, ఏదైనా వెరిఫికేషన్‌ సర్టిఫికెట్‌ కోసం వినతి, నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ వినతి, దొంగతనాల కేసులు, వాటి పరిస్థితులు, మీ సేవ ద్వారా పోలీస్‌ శాఖ నుంచి పొందే సేవల వివరాలను వెబ్‌సైట్‌ ద్వారా ప్రజ లు పొందేలా పోలీస్‌ శాఖ ఏర్పాట్లు చేసింది.

ఈ–పెట్టీ.. బిగ్‌ రిలీఫ్‌
రాష్ట్రంలోని అర్బన్‌ ప్రాంతాల్లో చిన్న చిన్న తగాదాలు, మందుబాబుల వీరంగాలు, వీధిపోరాటాలు, రాష్‌ డ్రైవింగ్, కాలుష్యం, పేకాట, ట్రాఫిక్‌ ఇబ్బందులు, సౌండ్‌ పొల్యూషన్, పబ్లిక్‌ న్యూసెన్స్‌ తదితరాలపై నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదు చేయాల్సి వస్తోంది. జరిమానాతో పోయే ఈ కేసులకు ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్లతో చాలా సమయం వృథా అవుతోంది. వీటికి చెక్‌ పెడుతూ ‘ఈ–పెట్టీ కేసు యాప్‌’ను పోలీస్‌ అధికారులు, సిబ్బంది కోసం డీజీపీ మహేందర్‌రెడ్డి అందుబాటులోకి తీసుకువచ్చారు. అర్బన్‌ ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది వద్ద ఉన్న ట్యాబ్‌లతో యాప్‌ ఉపయోగించి చిన్న కేసులకు సంబంధించిన వివరాలను ఘటనాస్థలిలోనే ఉంటూ నమోదు చేస్తున్నారు. ఘటన వివరాలు, ఫొటోలు, వీడియోలు తీసి ఆన్‌లైన్‌ ద్వారా కేసు నమోదు చేసి కాపీని బాధితుడితోపా టు నిందితులకు అందిస్తున్నారు. గతంలో పేపర్‌ వర్క్‌ వల్ల తీవ్ర నిర్లక్ష్యం, ఇతర వివాదాలు ఏర్పడేవి. ఇప్పుడలా కాకుండా స్పాట్‌ చార్జిషీట్‌తో సమయం ఆదాతో పాటు పోలీసులకు తలనొప్పి తప్పింది. ఈనెల 14వ తేదీన యాప్‌ ఆవిష్కరించగా 15 రోజుల్లో ఈ–పెట్టీ యాప్‌ సత్ఫలితాలిచ్చింది.

మరిన్ని వార్తలు