నీళ్లే ఉండవు.. ప్రవాహాలెక్కడివి!

20 Nov, 2017 01:19 IST|Sakshi

గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మార్గదర్శకాల అమలు వీలుకాదంటున్న రాష్ట్రం

విద్యుత్‌ కేంద్రాల దిగువన 15– 20 శాతం కనీస ప్రవాహాలుండాలంటున్న ట్రిబ్యునల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని జల విద్యుత్‌ కేంద్రాల దిగువన నదుల్లో కనీస ప్రవాహాలు నిరంతరం ఉండేలా చూడాలంటూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ రూపొందించిన మార్గదర్శకాలు కొత్త చిచ్చు రేపేలా ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా విద్యుత్‌ కేంద్రాల దిగువన కనీసం 15 నుంచి 20 శాతం ప్రవాహాలు కొనసాగించాలని ట్రిబ్యునల్‌ చేసిన సూచనను తెలంగాణ సహా పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా జీవ నదులు లేవని, వర్షాకాలం మినహా మిగతా సమయాల్లో ప్రవాహాలు ఉండవని, అలాంటి సమయంలో నిరంతర ప్రవాహాల కొనసాగింపు ఏమాత్రం సాధ్యమయ్యేది కాదని తెలంగాణ స్పష్టం చేస్తోంది. జల విద్యుత్‌ కేంద్రాల దిగువన నదుల్లో కనీస ప్రవాహాలు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించాలంటూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో పుష్పాసేన్‌ అనే సామాజిక కార్యకర్త కేసు వేశారు. ఈ కేసులో అన్ని రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై స్పందించిన ట్రిబ్యునల్, జలవిద్యుత్‌ కేంద్రాల దిగువన కనీసం 15 నుంచి 20 శాతం నిరంతర ప్రవాహం కచ్చితంగా ఉండాలనే నిబంధన పెట్టింది. తమ మార్గదర్శకాలపై రాష్ట్రాలు అభిప్రాయాలు చెబితే దీనిపై తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తామంటూ.. మార్గదర్శకాల ప్రతిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.

వర్షాకాలం మినహా ప్రవాహాలెక్కడ?
రాష్ట్రంలో ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదుల కింద మొత్తం 9 జల విద్యుత్‌ కేంద్రాలున్నాయి. ఇందులో 6 కృష్ణా నది పరిధిలో, 3 గోదావరి మీద ఉన్నాయి. ట్రిబ్యునల్‌ మార్గదర్శకాలను అమలు చేస్తే రాష్ట్రంలోని ఎస్‌ఎల్‌బీసీ, జూరాల, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, పులిచింతల వంటి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇందులో పులిచింతల మినహా మిగతావి దశాబ్ద కాలానికి పైగా నడుస్తున్నాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి సంబంధించిన చర్యలను ఏ విభాగం కూడా ఇప్పటివరకు నీటి పారుదల శాఖ దృష్టికి తేలేదు. వర్షాకాలం మినహా మిగతా సమయాల్లో అక్కడ ప్రవాహాలు ఉండే పరిస్థితి లేదు. గోదావరిలో 3 విద్యుత్‌ ప్రాజెక్టుల కింద మైళ్ల దూరం వరకు నది ఎండిపోయి ఉంటుంది. రాష్ట్రంలో నీటి లభ్యత చాలా తక్కువ. ఈ నేపథ్యంలో 15 నుంచి 20% కనీస ప్రవాహాలు కొనసాగించడం సాధ్యమయ్యేది కాదన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదన. ఒకవేళ కనీస ప్రవాహంకోసం 15 శాతం నీరు వదిలితే అవి ఇంకిపోతాయి తప్ప నిరంతర ప్రవాహం కొనసాగదని రాష్ట్రం అంటోంది. దీంతో పాటే కరువు రోజుల్లో రిజర్వాయర్లే నిండుకుంటున్నాయి. అలాంటప్పుడు ప్రవాహాల కొనసాగింపు సాధ్యమయ్యేదే కాదని రాష్ట్రం చెబుతోంది. 

స్థానిక పరిస్థితులనూ చూడాలి.. 
జల విద్యుత్‌ కేంద్రాల కింద సాగు, తాగు అవసరాలకే నీటిని విడుదల చేయాలి తప్పితే, కనీస ప్రవాహాల కోసం నీటిని విడుదల చేసే పరిస్థితి ఉండదని, స్థానిక పరిస్థితులను అధ్యయనం చేయకుండా ప్రవాహాలు ఉండాలన్న నిబంధన సరికాదని చెబుతోంది. అదీగాక కృష్ణా నదీ పరీవాహకంలో కనీస ప్రవాహాలు ఎలా ఉండాలో కృష్ణా వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌–2 వివరణ ఇచ్చింది. కృష్ణా ట్రిబ్యునల్‌ మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీలకు పంచిన నీటిలో 16 టీఎంసీలను సహజ ప్రవాహాల కింద లెక్కించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రిబ్యునల్‌ చెప్పిన రీతిలోనే సహజ ప్రవాహాలను కొనసాగించే వీలు లేదు. దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. ఇలాంటప్పుడు కొత్తగా మళ్లీ 15–20 శాతం సహజ ప్రవాహాలకు వీలెక్కడుంటుందని రాష్ట్రం వాదన. ఇదిలా ఉండగా ఈ వాదనను గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఎంతమేర పరిగణనలోకి తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.  
 

మరిన్ని వార్తలు