ఏపీఎన్జీవోల భూమిని బదలాయించొద్దు

8 Jul, 2014 08:24 IST|Sakshi
ఏపీఎన్జీవోల భూమిని బదలాయించొద్దు

ఆ భూములపై యధాతథస్థితిని కొనసాగించండి
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..
కౌంటర్ల దాఖలుకు ఆదేశం
విచారణ 4 వారాలకు వాయిదా

 
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలో ఏపీ ఎన్జీవో మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన 189.11 ఎకరాల భూమిని మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ)కి బదలాయించొద్దని హైకోర్టు సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ భూమిని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నందున, దాని విషయంలో యధాతథస్థితి (స్టేటస్ కో)ని కొనసాగించాలని రెవెన్యూ శాఖ అధికారులకు స్పష్టం చేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. భూమి స్వాధీనానికి సంబంధించి ఎపీ ఎన్జీవో హౌసింగ్ సౌసైటీకి నోటీసు జారీ, ఇతర పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. గోపన్నపల్లిలో తమకు కేటాయించిన 189.11 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి (అసైన్‌మెంట్) బి.ఆర్.మీనా ఈ నెల 2న జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాజ్యంలోపిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. భూమి స్వాధీనం విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని తెలిపారు. భూ స్వాధీనానికి సంబంధించి గత ఏడాది సెప్టెంబర్‌లోనే నోటీసు ఇచ్చామని అధికారులు చెబుతున్నారని, వాస్తవానికి తమకెటువంటి నోటీసూ అందలేదని కోర్టుకు నివేదించారు. తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. భూముల స్వాధీనం నిర్ణయం ప్రస్తుత ప్రభుత్వానిది కాదని చెప్పారు. గత ప్రభుత్వం 2013 సెప్టెంబర్ 20న సొసైటీకి నోటీసు జారీ చేసి, భూ కేటాయింపులను ఎందుకు రద్దు చేయరాదో వివరణ కోరగా సమాధానం రాకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం భూ స్వాధీన చర్యలకు ఉపక్రమించిందని చెప్పారు. హౌసింగ్ సొసైటీ నోటీసు అందుకుందంటూ,  సంబంధిత అక్నాలడ్జ్‌మెంట్‌ను న్యాయమూర్తి ముందుంచారు. హౌసింగ్ సొసైటీ భూముల విషయంలో యధాతథస్థితిని విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని ఎపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు