జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎవరో? 

10 Feb, 2019 12:34 IST|Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గత చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత ఈనెల 2వ తేదీ తన పదవికి రాజీనామా చేయగా.. ప్రభుత్వం ఆమోదించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న పదవిలో ప్రభుత్వం ఎవరిని నియమిస్తుంది.. ఎటువంటి విధానాన్ని అవలంబిస్తుంది.. దేనిని ప్రాతిపదికగా తీసుకుంటుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరో రెండు నెలల్లో జిల్లా పరిషత్‌ పదవీ కాలం పూర్తవుతున్నందున ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న బరపటి వాసుదేవరావుకే చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తొలుత భావించినా.. పంచాయతీరాజ్‌ చట్టాలను అనుసరించి.. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై జిల్లా అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు సమాచారం.

సాధారణంగా జిల్లా పరిషత్‌ పాలకవర్గం పదవీ కాలం ఆరు నెలల్లోపు ఉండి.. చైర్మన్‌ పదవి ఖాళీ అయిన పక్షంలో ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న వారికి చైర్మన్‌గా అవకాశం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే జెడ్పీ చైర్‌పర్సన్‌గా రాజీనామా చేసిన గడిపల్లి కవిత ఆ పదవిలో 2014, ఆగస్టు 7న బాధ్యతలు స్వీకరించడంతో ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి రాజీనామా చేసిన తేదీ వరకు గల రోజులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. ఆరు నెలల ఆరు రోజులు చైర్‌పర్సన్‌ పదవీ కాలం ఉన్న విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలుస్తోంది. ఆరు నెలలకు మించి చైర్‌పర్సన్‌ పదవీ కాలం ఉన్న పక్షంలో పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఆ పదవికి సభ్యుల్లో అర్హులైన వారిని ఎన్నుకోవాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నట్లు సంబంధిత అధికారులు.. ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం. దీంతో చైర్మన్‌ పదవీ వ్యవహారం రసకందాయంలో పడినట్లయింది
  
విశ్లేషణలో ఎవరికి వారే.. 
అయితే జెడ్పీ చైర్మన్‌ పదవిని ఏ ప్రాతిపదికన.. ఎవరితో భర్తీ చేయాలనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేంత వరకు ఈ పదవి భర్తీ వ్యవహారంపై  ఆయా పార్టీలు విశ్లేషణలో పడ్డాయి. 15 రోజులపాటు చైర్మన్‌ పదవి ఖాళీగా ఉంటే ఆ తర్వాత యథావిధిగా వైస్‌ చైర్మన్‌ జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం సైతం ఉందని పంచాయతీరాజ్‌ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజీనామా చేసి వారం రోజులు కావడం.. మరో వారం రోజుల్లోగా ప్రభుత్వం నుంచి ఏదైనా నిర్ణయం రాని పక్షంలో ప్రస్తుత వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వారికే చైర్మన్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. అయితే జెడ్పీ చైర్మన్‌ రాజీనామా, ప్రమాణ స్వీకారం మధ్య వ్యత్యాస కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఆరు నెలలకుపైగా ఉందని ప్రభుత్వం భావిస్తే చైర్మన్‌ పదవికి మళ్లీ ఎన్నిక నిర్వహించే అవకాశం సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఖాళీ అయిన చైర్‌పర్సన్‌ పదవి కోసం అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు జెడ్పీటీసీ సభ్యులు దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్సీ మహిళలకు రిజర్వు అయిన ఈ పదవిని దక్కించుకునేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి నలుగురు మహిళలు అధికార టీఆర్‌ఎస్‌లో ఉన్నారు.

వీరిలో ఒకరికి అవకాశం కల్పిస్తారా? లేదా? ప్రభుత్వం ఉపాధ్యక్షుడిని కొనసాగిస్తుందా? లేకపోతే ప్రభుత్వ అధికారికి బాధ్యతలు అప్పగిస్తుందా? అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేసిన గడిపల్లి కవిత అవిభాజ్య ఖమ్మం జిల్లా వెంకటాపురం జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఎన్నిక నిర్వహించినట్లయితే అశ్వాపురం, చర్ల, పినపాక, వాజేడు జెడ్పీటీసీల్లో ఒకరికి చైర్‌పర్సన్‌గా అవకాశం లభించనుంది. ఈ నలుగురు అధికార టీఆర్‌ఎస్‌లో కొనసాగుతుండగా.. ఏన్కూరు జెడ్పీటీసీ మాత్రం టీడీపీలో కొనసాగుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌లో ఉన్న నలుగురిలో ఒకరికి జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే రాష్ట్రంలోని అన్ని జెడ్పీటీసీలకు 2014 ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి. ఖమ్మం జిల్లాలో సైతం అదే సమయంలో ఎన్నికలు జరిగినా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 5 మండలాలు ఏపీలో కలవడం, అంతకుముందే జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన జెడ్పీటీసీలు ఏ జిల్లా పరిషత్‌ పరిధిలోకి వస్తారనే అంశంపై స్పష్టత రావడానికి సమయం పట్టడంతో ఆగస్టులో ఖమ్మం జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి భర్తీ అయింది. అప్పటి వరకు ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న ఐదు మండలాలు పూర్తిగా విలీనం కావడంతో.. 41 మండలాల జెడ్పీటీసీలు ఖమ్మం జెడ్పీ పరిధిలోకి రానున్నారని ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నాలుగు నెలలు ఆలస్యంగా జెడ్పీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. ఈ అంశాలన్నింటినీ ఎన్నికల నోటిఫికేషన్లతో సహా జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి.. జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి భర్తీకి అనుసరించే విధానంపై నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు