సగం ధరకే స్టెంట్లు 

19 Jun, 2019 03:34 IST|Sakshi

త్వరలో తక్కువ ధరకే మార్కెట్లోకి

అభివృద్ధిపరచిన ‘మిథాని’ సంస్థ

సాక్షి, హైదరాబాద్‌: గుండెజబ్బుల చికిత్స కోసం ఉపయోగించే స్టెంట్లు మరింత చౌక కానున్నాయి. నికెల్, టైటానియం డయాక్సైడ్‌ల మిశ్రమంతో తయారైన సరికొత్త స్టెంట్‌ను హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న రక్షణ శాఖ సంస్థ మిధాని (మిశ్ర ధాతు నిగమ్‌) అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టెంట్ల ధరలో సగానికే కొత్తవి అందుబాటులోకి వస్తాయని, ప్రస్తుతం వీటిని ఓ మెడికల్‌ యూనివర్సిటీ పరీక్షిస్తున్నట్లు మిధాని చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దినేశ్‌ లేఖీ తెలిపారు. ‘షేప్‌ మెమరీ అల్లాయ్‌’గా పిలిచే ఈ కొత్త లోహ మిశ్రమాన్ని కొన్ని నెలల కిందే అభివృద్ధి చేశామని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే మరో ఏడాదిన్నరలో ఈ కొత్త స్టెంట్‌ అందుబాటులోకి రావొచ్చని చెప్పారు.

స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కంటే ఎంతో మెరుగైన టైటానియం, ఇతర లోహాల తయారీలో ప్రఖ్యాతిగాంచిన మిధాని ఈ ఏడాది నుంచి బయో ఇంప్లాంట్స్‌ మార్కెటింగ్‌ రంగంలోకి అడుగుపెడుతోందని హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. కృత్రిమ పళ్లు బిగించేందుకు అవసరమైన స్క్రూ మొదలుకొని, కృత్రిమ కీళ్లు, భుజాలు, మోకాలు చిప్ప, తుంటి ఎముకలను తాము చాలా కాలంగా తయారు చేస్తున్నామని, ఇప్పటివరకు వాటి మార్కెటింగ్‌కు ప్రయత్నాలు చేయలేదని చెప్పారు. హిందుస్తాన్‌ యాంటీ బయోటిక్స్‌ లిమిటెడ్‌తో బయో ఇంప్లాంట్స్‌ మార్కెటింగ్‌కు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. 

పరీక్షలు అవసరం.. 
టైటానియం, నికెల్‌ స్టెంట్ల గురించి మాట్లాడుతూ వీటి సామర్థ్యాన్ని ప్రపంచానికి నిరూపించేందుకు విస్తృత స్థాయిలో వందల మందితో పరీక్షలు నిర్వహించాల్సి ఉందని.. ఇందుకోసం మిలటరీ ఆసుపత్రులను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు దినేశ్‌ లేఖీ చెప్పారు. ఈ పరీక్షలు తమ దేశంలోనే నిర్వహించాలని ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కజకిస్తాన్‌ ప్రతిపాదించిందని, సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని తగు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో బయో ఇంప్లాంట్స్‌ మార్కెటింగ్‌ ద్వారా రూ.100 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌ఏఎల్‌ చైర్మన్, ఎండీ నీరజా సరాఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు