కడుపు కోతలు మహిళలకేనా..?

12 Nov, 2014 05:16 IST|Sakshi
కడుపు కోతలు మహిళలకేనా..?

* కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో మహిళలదే అగ్రస్థానం
* వెసెక్టమీకి ఆసక్తి చూపని పురుషులు
* అవగహన కల్పించడంలో విఫలమవుతున్న అధికారులు

నల్లగొండ టౌన్: కుటుంబం బాధ్యత భార్యాభర్తలిద్దరిది. అలాగే కుటుంబ నియంత్రణలో కూడా మహిళలతో పాటు పురుషుల బాధ్యత కూడా ఉంది. కానీ కుటుంబ నియంత్రణ అనగానే వైద్య ఆరోగ్యశాఖతో పాటు కుటుంబ సభ్యులకు గుర్తు వచ్చేది మహిళలే. కుటుంబ నియంత్రణ కోసం పురుషులకు వెసెక్టమీ, మహిళలకు ట్యూబెక్టమీతో పాటు డీపీఎల్ ఆపరేషన్లు చేస్తుంటారు. అయినా వెసెక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడానికి పురుషులు ముందుకు రావడం లేదు. జిల్లాలో 2010 నుంచి 2014 అక్టోబర్ వరకు 1,16,707 మంది మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే కేవలం 368 మంది పురుషులు మాత్రమే వెసెక్టమీ చేయించుకున్నారు. దీనిని బట్టే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలలో పురుషులు మహిళల పట్ల ఎంత వివక్షత చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు.


 
అపోహలతో అనాసక్తి..
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మహిళలకంటే పురుషులకు చేయడం ఎంతో సులభం..సురక్షితం.   కానీ పురుషులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిం చుకుంటే కష్టం చేయడానకి ఇబ్బందులు ఏర్పాడతాయని, సంసారజీవితానికి కూడా ఆటంకం కలుగుతుందనే అపోహ, మూఢ నమ్మకాలు ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్నాయి. దీంతో మహిళలకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం పరిపాటిగా మారింది. అయితే వెసెక్టమీ చేయించుకున్న పురుషుడు అదే రోజు తన రోజువారి పనులను యథావిధిగా చేసుకోవచ్చు. వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. కానీ మహిళలు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే కనీసం ఇరువై రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.
 
అవగాహన కల్పించడంలో విఫలం
వెసెక్టమీ ఆపరేషన్లపై ప్రజలకు అవగాహన కల్పించడంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా విఫలం చెందిందనే ఆరోపణలు ఉన్నాయి. వెసెక్టమీపై ఉన్న అపోహలు, మూఢ నమ్మకాలను తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే పురుషులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం ముందుకు రావడం లేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ల కోసం క్షేత్ర స్థాయిలోని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మహిళలనే ప్రోత్సహిస్తున్నారే తప్ప వెసెక్టమీని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు