హడలెత్తించిన రాళ్లవాన

16 Feb, 2019 04:15 IST|Sakshi
తొంబర్రావుపేటలో నేలకొరిగిన మొక్కజొన్న పంట

కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో ఈదురుగాలుల బీభత్సం 

నేల కూలిన వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు 

దెబ్బతిన్న పంటలు.. తడిసిన పసుపు, కందులు 

లబోదిబోమంటున్న రైతులు  

సాక్షి నెట్‌వర్క్‌: ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో శుక్రవారం రాత్రి రాళ్లవాన హడ లెత్తించింది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో వృక్షాలు, స్తంభాలు నేలకూలాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. భీకర గాలులకు పలు ఇళ్ల రేకులు కొట్టుకుపోయాయి. హోర్డింగ్‌లు ఊడిపడటంతో పలువురు గాయపడ్డారు. వృక్షాలు కూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. మొక్కజొన్న, కందులు, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల వద్ద ఆరబెట్టిన పసుపు తడిసిపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.

జగిత్యాల జిల్లాలోని మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లో మొక్కజొన్న, పసుపు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జగిత్యాల మార్కెట్‌యార్డులో అమ్మకానికి తీసుకొచ్చిన కందులతోపాటు వ్యాపారులకు చెందిన వరిధాన్యం బస్తాలు తడిసిపోయాయి. మెట్‌పల్లి డివిజన్‌లో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి మండలాల్లో చేతికి వచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

నువ్వుల పంటకు తీవ్ర నష్టం జరిగింది. మెట్‌పల్లి బస్టాండ్‌ వద్ద భవనంపై ఉన్న భారీ హోర్డింగ్‌ ఊడి పడటంతో పలువురు గాయపడ్డారు. మార్కెట్‌యార్డులో నిల్వ ఉంచిన సుమారు వెయ్యి క్వింటాళ్ల పసుపు, 200 క్వింటాళ్ల కందులు తడిసిపోయాయని అధికారులు తెలిపారు. కొండాపూర్‌లో మర్రిచెట్టు విరిగి పడటంతో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. గాలికి పలు గృహాల రేకులు కొట్టుకుపోయాయి. ఇబ్రహీంపట్నం మండలంలో కల్లాల వద్ద ఆరబెట్టిన పసుపు తడిసింది. అమ్మక్కపేట నుంచి డబ్బా దారిలో తాటిచెట్టు విరిగి పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రాళ్ల వానతో మామిడి పూత, పిందె రాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలితో కూడిన వాన రావడంతో జనాలు ఇబ్బంది పడ్డారు. అలాగే.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా మెండోరా, ముప్కాల్, బాల్కొండ మండలాల్లో వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జల మయమయ్యాయి. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌యార్డులో సుమారు 10 వేల క్వింటాళ్ల పసుపు తడిసింది.

మరిన్ని వార్తలు