సింగోటం చెరువు వద్ద మైనింగ్‌ ఆపండి

25 Apr, 2018 01:04 IST|Sakshi

మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ఎన్జీటీ 

సాక్షి, న్యూఢిల్లీ: నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలె గ్రామం సింగోటం చెరువు వద్ద ధృవ ఎంటర్‌ప్రైజెస్‌ అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్న మైనర్‌ మినరల్స్‌ మైనింగ్‌ను ఆపాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) మంగళవారం ఆదేశించింది. చెరువుకు సమీపంలో 24 హెక్టార్లలో మైనింగ్‌కు సంబంధించి మంజూరైన పర్యావరణ అనుమతులను సవాల్‌ చేస్తూ శ్రీనివాసులు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ జావేద్‌ రహీద్‌ నేతృత్వంలోని బెంచ్‌ మంగళవారం విచారించింది.

చెరువు జీవావరణ వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా గ్రామంలోని రెండువేలకుపైగా మత్స్యకారుల కుటుంబాల ఉపాధికి గండికొట్టేలా సదరు సంస్థ మైనింగ్‌కు పాల్పడుతోందని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై గత ఐదు నెలలుగా సంస్థ యాజమాన్యం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో పనులు నిలిపేయాలంటూ ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు తెలిపారు. 

మరిన్ని వార్తలు