ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న లారీ

17 Jun, 2015 23:59 IST|Sakshi

వర్గల్ : సిలిండర్ల లోడ్‌తో వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొనగా ఒకరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండలంలోని గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం తె ల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న లారీ డ్రైవర్ మొగులుగాని సత్యం (50) ఆస్పతిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, క్లీనర్ గుగులోతు వెంకన్న (40) గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సిలిండర్ లారీ డ్రైవర్ బురాన్ నగేష్ (35) కాలు పూర్తిగా తెగిపోయింది. అదృష్టవశాత్తు సిలిండర్లు పేలడం లాంటి ఘటన చోటుచేసుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద తీవ్రతకు సిలిండర్ లారీ డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోగా దాదాపు రెండు గంటల పాటు శ్రమించి వెలికి తీశారు. గౌరారం ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి కలపను తీసుకువచ్చేందుకు బుధవారం రాత్రి ఓ లారీ హైదరాబాద్ నుంచి బయలుదేరింది.
 
 అయితే లారీలో సాంకేతిక లోపం కారణంగా గౌరారం వద్ద రోడ్డు పక్కన ఆగిపోయింది. డ్రైవర్ సత్యం, క్లీనర్ గుగులోతు వెంకన్న అందులోనే కూర్చుని ఉన్నారు. తెల్లవారుజాము 3.30 గంటల ప్రాంతంలో చర్లపల్లి నుంచి హెచ్‌పీ సిలిండర్ల లోడ్‌తో సిద్దిపేట వైపు వెళుతున్న లారీ అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో రెండు లారీలు 50 గజాలు పైగా ముందుకు దూసుకెళ్లాయి. ఆగి ఉన్న లారీ రోడ్డు కిందకు గోతిలోకి జారిపడగా, కల్వర్టు గోడ అడ్డుతగిలి సిలిండర్ల లోడుతో వెళుతున్న లారీ ఆగిపోయింది. క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కావడంతో సిలిండర్ లారీ డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోయాడు. దాదాపు రెండు గంటలపాటు నరక యాతన అనుభవించాడు. గౌరారం పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని వెలికి తీసే ప్రయత్నం విఫలమైంది. జేసీబీ సాయం తీసుకుని లారీలను విడదీసి డ్రైవర్‌ను వెలికి తీసారు.
 
 నిండు సిలిండర్లు కావడంతో పేలిపోయే ప్రమాదం శంకించి గజ్వేల్ నుంచి అగ్నిమాపక వాహనాన్ని తెప్పించారు. ప్రమాదంలో అతడి కాలు కొంత మేర పూర్తిగా తెగిపోయింది. ముందులారీ డ్రైవర్ సత్యంకు, క్లీనర్ వెంకన్నకు తీవ్రగాయాలు కాగా వారందరినీ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యం మృతి చెందాడు. మృతుడి సొంత గ్రామం వరంగల్ జిల్లా నర్సింహులు పేట మండలం బీర్‌శెట్టి గూడెం. మృతుడికి భార్య వెంకటమ్మ, కొడుకు రాజేష్ (19) ఉండగా ఇద్దరు కూతుళ్ల వివాహం జరిగింది. డ్యూటీకి వెళ్లిన భర్త రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన విషయం తెలిసి వెంకటమ్మ కుటుంబం పెను విషాదంలో కూరుకుపోయింది.
 
 ప్రమాదానికి కారణమైన సిలిండర్లలోడుతో వెళుతున్న లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని, మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపించి కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

మరిన్ని వార్తలు