బకాయిలపై ‘పంచాయితీ’!

2 Jan, 2017 03:30 IST|Sakshi
బకాయిలపై ‘పంచాయితీ’!

- పాత బకాయిలు చెల్లించని గ్రామాలకు కరెంట్‌ నిలిపేస్తున్న డిస్కంలు
- 14వ ఆర్థిక సంఘం నిధుల్లోనూ కోత పెడుతున్న ఈవో పీఆర్డీలు
- 20 శాతం మినహాయింపుపై మంత్రి హామీ ఇచ్చినా జారీ కాని ఉత్తర్వులు
- డిస్కంలు ఇచ్చిన పాత బిల్లులన్నీ అశాస్త్రీయమైనవేనంటున్న సర్పంచ్‌లు  

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీలకు విద్యుత్‌ బిల్లుల గ్రహణం ఇంకా వీడలేదు. పాత విద్యుత్‌ బకాయిలు చెల్లించలేదనే నెపంతో డిస్కంలు పలు గ్రామాలకు కరెంట్‌ సరఫరాను నిలిపి వేస్తున్నాయి. దీంతో పలు గ్రామాల్లో మోటార్లు పనిచేయక మంచినీటి సరఫరా జరగడం లేదు. రాత్రివేళల్లో వీధి లైట్లు కూడా వెలగడం లేదు. కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రంగా రెడ్డి జిల్లాల్లో ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలే విద్యుత్‌ బిల్లులు చెల్లించగా, తెలంగాణ వచ్చాక ఆ భారాన్ని పంచా యతీలపై వేయడమేంటని ఇటీవల సర్పంచుల సంఘాలు ఆందోళనకు దిగాయి.

ఈ నేపథ్యంలోనే విద్యుత్‌ బకాయిల రూపేణా గ్రామ పంచాయతీ లపై పడుతున్న భారాన్ని కొంత మేరకు తగ్గిస్తామ ని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు ఇటీవల సర్పంచ్‌లకు హామీ ఇచ్చారు. గతంలో 30 శాతం నిధులను చెల్లించాలని ఆదేశాలుండగా.. ప్రస్తుతానికి 10 శాతం చెల్లిస్తే చాలని సర్పంచులతో మంత్రి పేర్కొన్నారు. అయితే.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ కాకపోవడంతో విద్యుత్‌బకాయిల వసూలుపై డిస్కంల సిబ్బంది, ఈవో పీఆర్‌డీలు భీష్మించుకుని కూర్చున్నారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీలకు అందిన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 30 శాతం విద్యుత్‌ బిల్లులకు చెల్లించాల్సిందేనని ఈవో పీఆర్డీలు అంటుండగా.. చెల్లించని గ్రామాలకు డిస్కంల సిబ్బంది కరెంటును నిలిపేస్తున్నారు.

బకాయిలు రూ. 942 కోట్లు
గ్రామ పంచాయతీల్లో సుమారు రూ. 942 కోట్ల పాత బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని డిస్కంలు సర్కారుకు నివేదికను అందజేశాయి. పంచాయతీ లకు ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధుల నుంచి విద్యుత్‌ బకాయిలను రాబట్టుకోవాలని డిస్కం లకు, పంచాయతీరాజ్‌ అధికారులకు సర్కారు సూచించింది. అయితే.. శాస్త్రీయ విధానం లేకుండా డిస్కంలు చెబుతున్న బకాయిల లెక్కలను గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రామ పంచాయతీల విద్యుత్‌ బకాయిలను గతంలో సర్కారే చెల్లించిందని, ప్రస్తుతం కూడా బకాయిలను ప్రభుత్వం నుంచే డిస్కంలు రాబట్టుకోవాలని వారు స్పష్టం చేస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధుల్ని విద్యుత్‌ బకాయిలకే  వెచ్చిస్తే.. పంచాయితీల నిర్వహణ కష్టమని వారు వాపోతున్నారు.

ముందుకు సాగని మూడోలైన్‌ పనులు
గ్రామ పంచాయతీల్లో వీధిలైట్ల విద్యుత్‌ వినియోగం లెక్కలను తేల్చేందుకు మూడోలైన్‌ ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించినా, క్షేత్రస్థాయిలో ఆ మేరకు పనులు జరగడం లేదు. రూ.వందల కోట్లలో విద్యుత్‌ బకాయిలంటూ గ్రామ పంచాయతీలను షాక్‌కు గురి చేస్తున్న డిస్కంలను నియంత్రించేందుకు పంచాయతీ రాజ్‌ ఉన్నతాధికారులు చేసిన మూడోలైన్‌ ప్రతి పాదనకు ఏడాది కిందటే సర్కారు ఆమోదం తెలిపింది. గృహావసరాల కోసం విద్యుత్‌ శాఖ వేసిన రెండు లైన్లకు సమాంతరంగా వీధిలైట్లకు ప్రత్యేకంగా మూడో లైన్‌ (వైర్‌) ఏర్పాటు చేయాలని, ఇందుకు సుమారు రూ.10 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు.

>
మరిన్ని వార్తలు