సబ్‌ప్లాన్‌పై దుమారం

25 Mar, 2015 00:58 IST|Sakshi
సబ్‌ప్లాన్‌పై దుమారం

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై విపక్షాల ముప్పేట దాడి
సబ్‌ప్లాన్ చట్టాన్ని ఇంకా అడాప్ట్ చేసుకోలేదన్న ఉప ముఖ్యమంత్రి
కడియం వ్యాఖ్యలపై మండిపాటు
విపక్షాల ఆందోళనలతో అట్టుడికిన శాసనసభ
 

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల అమలులో సర్కారు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రం ఏర్పాటై 9 నెలలు గడిచినా ఇంతవరకు సబ్‌ప్లాన్ అమలుకు సంబంధించిన నిబంధనలను సైతం రూపొందించలేదని ఎండగట్టాయి. సబ్‌ప్లాన్ అమలు తీరును సమీక్షించేందుకు ఆర్నెల్ల కోసారి ముఖ్యమంత్రి నేతృత్వంలో జరగాల్సిన కౌన్సిల్ సమావేశాన్ని ఇప్పటివరకు నిర్వహించలేదని దుమ్మెత్తిపోశాయి. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలు ముప్పేటదాడికి దిగడంతో మంగళవారం  శాసనసభలో పలుమార్లు గందరగోళం ఏర్పడింది. విపక్షాల ప్రశ్నలకు బదులిచ్చే క్రమంలో ‘సబ్‌ప్లాన్ చట్టాన్ని ఇంకా తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకోలేదు’ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించడం అగ్నికి ఆజ్యం పోసింది.

కాంగ్రెస్ సభ్యురాలు జె.గీతారెడ్డి సభా నిర్వహణ నియమావళిలోని 344వ నిబంధన కింద ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు అంశాన్ని లేవనెత్తారు. 2014-15 బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపులతో పోల్చితే వ్యయం చాలా తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 15 శాతం మాత్రమే విడుదలయ్యాయన్నారు. విడుదల కాని నిధులు మురిగిపోకుండా వచ్చే బడ్జెట్ కేటాయింపుల్లో జమచేసే విధంగా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టానికి సవరణలు చేయాలని సూచించారు. మాల, మాదిగ మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారని సంపత్‌కుమార్ (కాంగ్రెస్) ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులు విడుదల కాకపోవడానికి గల కారణాలను వివరించారు. ఉప ప్రణాళికల చట్ట సవరణ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, గీతారెడ్డి చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈ చట్టాన్ని ఇంకా తెలంగాణకు అడాప్ట్ చేసుకోలేదని, ఆ సమయంలో ఈ మేరకు సవరణలు చేస్తామన్నారు.

మంత్రి సమాధానంపై బీజేపీఎల్పీనేత లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాన్ని అడాప్ట్ చేసుకోడానికి ఒక్కరోజు చాలని, ఇంతకాలం ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. సబ్‌ప్లాన్ చట్టాన్ని ఇంకా అడాప్ట్ చేసుకోకపోవడం శోచనీయమని గీతారెడ్డి వ్యాఖ్యానించారు. ఇది దళితులైన మాకు చెంపపట్టు అన్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నంలో చేసిన వ్యాఖ్యలు సభలో  దుమారం రేపాయి. అడాప్ట్ చేసుకోడానికి 9 నెలలు ఎందుకు ఆగారని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పీకర్ అనుమతితో భట్టి విక్రమార్క   మాట్లాడుతుండగా, హోంమంత్రి నాయిని అడ్డుపడ్డారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయన్నారు.
 

మరిన్ని వార్తలు