దేవుడా! వైద్యులకే కరోనా వస్తే..

19 Apr, 2020 10:26 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని పలు ఆస్పత్రుల్లో వైద్య సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి సైతం కరోనా వైరస్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. శుక్రవారం పురానా హవేలీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి చెందిన వైద్యుడు సహా ఇద్దరు స్టాఫ్‌ నర్సులకు కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కాగా, తాజాగా శనివారం నిమ్స్‌లోని ఓ స్టాఫ్‌ నర్సు సహా హౌస్‌కీపింగ్‌ వర్కర్‌కూ పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. ఎమర్జెన్సీ మెడిసిన్‌ విభాగంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సహా ముగ్గురు రెసిడెంట్‌ వైద్యులతో పాటు జనరల్‌ మెడిసిన్‌ విభాగంలోని మరో ముగ్గురు రెసిడెంట్లు కరోనా పాజిటివ్‌ కేసుకు ఎక్స్‌పోజ్‌ కాగా వారందరినీ ఇప్పటికే క్వారంటైన్‌లో ఉంచారు. కేవలం కరోనా ఐసోలేషన్‌ వార్డుల్లో పని చేస్తున్న వైద్యు సిబ్బందికి మాత్రమే రక్షణ కోసం ఎన్‌– 95 మాస్క్‌లు, గ్లౌజులు, పీపీఈ కిట్‌లు సరఫరా చేస్తున్నారు. అత్యవసర విభాగాలు, ఔట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్‌ వార్డుల్లో పని చేసే వారికి సరఫరా చేయడం లేదు. ఆస్పత్రికి వచ్చిన వారిలో ఎవరికీ ఏ వైరస్‌ ఉందో గుర్తించడం కష్టంగా మారుతోంది. తీరా తెలిసేసరికి వైద్యసేవలు అందిస్తున్న సిబ్బంది కూడా వైరస్‌ బారిన పడుతున్నారు. (స్లమ్స్‌లో వణుకు... ఇక్కడా ఇరుకు)

వారే కాదు.. కుటుంబ సభ్యులూ రిస్క్‌లోనే.. 
ఇప్పటికే సోమాజిగూడలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి చెందిన వైద్యుడి నుంచి ఆయన భార్యకు, తల్లికి వైరస్‌ సోకింది. ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో పని చేస్తున్న మియాపూర్‌కు చెందిన ల్యాబ్‌ టెక్నిషియన్‌ ద్వారా ఆమె తల్లి, తండ్రి, తమ్ముడికి పాకింది. గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలోని వైద్యుడు సహా స్టాఫ్‌ నర్సుకు పాజిటివ్‌ వచ్చింది. డిప్యుటేషన్‌పై వచ్చి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో స్కానింగ్‌ విధులు నిర్వహించిన మహబూబ్‌నగర్‌కు చెందిన ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆస్పత్రుల్లో పని చేస్తున్న వారిలో ఒకరి తర్వాత మరొకరు రిస్క్‌లో పడుతుండటమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా రిస్క్‌లో పెడుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

ఇలా ఇప్పటి వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 14 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు తెలిసింది. ఆస్పత్రికి వచ్చిన రోగుల్లో ఎవరికి ఏ వైరస్‌ ఉందో? ఎవరి నుంచి ఎలా వైరస్‌ విస్తరిస్తుందో? తెలియడం కష్టంగా మారింది. ఆస్పత్రికి వచ్చిన వారిలో చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాల ఉంటే వాటిని దాచిపెడుతున్నారు. ఈ విషయం తెలియక వైద్యులు నేరుగా ఓ సాధారణ రోగిని పరీక్షించినట్లే క్లోజ్‌ మానిటరింగ్‌ చేస్తున్నారు. మందులు ఇచ్చినా నిమోనియా, జ్వరం తగ్గకపోవడంతో అనుమానం వచ్చి టెస్టులు చేయిస్తే.. అసలు విషయం బయటపడుతోంది. తీరా విషయం తెలిసేసరికి వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ఇతర పారామెడికల్‌ స్టాఫ్‌కు వైరస్‌ విస్తరిస్తోంది. విషయం తెలియక వారు కూడా ఆస్పత్రి నుంచి  ఇంటికి వెళ్తున్నారు. కుటుంబ సభ్యు లకు వైరస్‌ను విస్తరింపజేస్తున్నారు. 

నిలోఫర్‌లో..  
మార్చి మూడో వారంలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న నాంపల్లికి చెందిన 18 నెలల బాలుడిని నిలోఫర్‌ ఆస్పత్రి ఈఎస్‌ఆర్‌కు తరలించారు. మందులు వాడినా నిమోనియా తగ్గక పోవడంతో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించారు. పాజిటివ్‌గా తేలింది. అప్పటికే  నాలుగు రోజులుగా శిశువుకు వైద్యం చేసిన జూనియర్‌ డాక్టర్లు సహా స్టాఫ్‌ నర్సులు, సెక్యూరిటీ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. మొత్తం 25 మందిని క్వారంటైన్‌ చేసి పరీక్షలు చేశారు. అదృష్టవశాత్తు వైద్య సిబ్బందిలో ఎవరికీ పాజిటివ్‌ రాలేదు.

తాజాగా నారాయణపేట జిల్లాకు చెందిన రెండు నెలల శిశువుకు పాజిటివ్‌ వచ్చింది. శిశువును ఈ నెల 15న నిలోఫర్‌లో అడ్మిట్‌ చేశారు. 16న నమూనాలు సేకరించి పంపగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఈ శిశువుకు క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్న వైద్య సిబ్బందిలో ఆందోళన మొదలైంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతూ వచ్చే శిశువులను ఐసోలేషన్‌ వార్డులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసినా.. ఇక్కడి వైద్యులు మాత్రం ఈఎస్‌ఆర్‌లోని ఇతర శిశువుల మధ్యే ఉంచి చికిత్సలు అందిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఉస్మానియాలో.. 
రంగారెడ్డి జిల్లా చేగూర్‌కు చెందిన మహిళ ఇటీవల ఉస్మానియా ఆస్పత్రి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆ తర్వాత ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెకు చికిత్స చేసిన వైద్య సిబ్బందిని మొత్తం క్వారంటైన్‌ చేసి, పరీక్షలు నిర్వహించారు. నాలుగు రోజుల క్రితం కరోనా ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న రోగి తాలూకు  బంధువులు విధి నిర్వహణలో ఉన్న జూనియర్‌ వైద్యులపై దాడి చేసిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత బాధితుడు సహా వైద్యులపై దాడికి పాల్పడిన బంధువులకు పాజిటివ్‌ ఉన్నట్లు తెలియడంతో వైద్యుల్లో ఆందోళన మొదలైంది. దీంతో పాజిటివ్‌ కేసులకు క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్న వారందరినీ క్వారంటైన్‌ చేసి, పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. 

కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ.. 
ఉస్మానియా, గాంధీ, కింగ్‌కోఠి ప్రభుత్వ ఆస్పత్రు ల్లోనే కాదు పాతబస్తీలోని పురానాహవేలీ, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, గచ్చిబౌలిలలోని ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ కరోనా పాజిటివ్‌ కేసుల మరణాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. నిమోనియా ఇతర సమస్యలతో వచ్చిన  రోగులను గుట్టుచప్పుడు కాకుండా అడ్మిట్‌ చేసుకోవడం, వైద్యం పేరుతో భారీగా దండుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. చివరి నిమిషంలో బాధితుల నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపుతుండటం, తీరా వారు మృతి చెందిన తర్వాత కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు రిపోర్టులు రావడం తెలిసిందే. విషయం తెలియక ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బంది పాజిటివ్‌ కేసులకు క్లోజ్‌ కాంటాక్ట్‌లోకి వెళ్లి.. వారు కూడా వైరస్‌ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

>
మరిన్ని వార్తలు