కరోనా వచ్చిందిలా!

24 Mar, 2020 03:00 IST|Sakshi

మార్చి 2న రాష్ట్రంలో తొలి పాజిటివ్‌ కేసు నమోదు

ఆ తర్వాత నాలుగు రోజులకు రెండో కేసు

గత మూడు రోజుల్లోనే 14 కేసులు

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కోరలు చాస్తూ విశ్వరూపం చూపిస్తోంది. మూడు నెలల క్రితం చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పుడు మననూ గడగడలాడిస్తోంది. మార్చి 2న రాష్ట్రంలోకి ప్రవేశించిన ఈ కరోనా వైరస్‌... మూడు వారాల్లోనే రాష్ట్రాన్ని స్తంభింపజేసింది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించిన ఈ వైరస్‌.. వారితో సన్నిహితంగా ఉన్న వారికి సోకడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్‌ పాజిటివ్‌ కేసుగా నమోదైన తొలి వ్యక్తి కోలుకుని ఇంటికి చేరడం శుభసూచకమైతే.. ఆ తర్వాత క్రమేణా పెరుగుతున్న కేసుల సంఖ్య యావత్‌ తెలంగాణనూ కలవరపరుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 33 పాజిటివ్‌ కేసులు తేలగా... గత మూడు రోజుల్లోనే 14 నమోదు కావడంతో వైరస్‌ విస్తృతిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ సరిహద్దులు మూసివేసినా.. రాష్ట్రాన్ని అష్టదిగ్భందం చేసినా.. 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించినా.. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 

దుబాయ్‌ వయా బెంగళూర్‌..
మన రాష్ట్రంలో కరోనా వైరస్‌ తొలి పాజిటివ్‌ కేసు మార్చి 2న నమోదైంది. దేశవ్యాప్తంగా ఆ రోజున రెండు కేసులు తేలగా.. అందులో రాష్ట్రంలోని కేసు ఒకటి. బెంగళూర్‌లో పనిచేసే హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వృత్తిపని మీద దుబాయ్‌కు వెళ్లారు. మూడు రోజుల తరువాత బెంగళూర్‌కు వచ్చి అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్‌కు చేరుకున్నారు. 3 రోజుల తర్వాత గాంధీలో చేరిన ఆయనకు కోవిడ్‌ ఉన్నట్లు తేలింది. ఈ కేసుతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న పౌరులకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసింది. జ్వరం, దగ్గు, తుమ్ములాంటి లక్షణాలుంటే తక్షణమే గాంధీలో చేర్చింది.

ఒకవేళ ఎలాంటి లక్షణాలు కనిపించకున్నా.. 14 రోజులు క్వారంటైన్‌ (స్వీయ నిర్బంధం)కు వెళ్లాలని స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వ క్యారంటైన్‌ నుంచి కొందరు పారిపోగా.. మరికొందరు ఇంట్లో ఉంటామని చెప్పి స్వేచ్ఛగా తిరిగారు. మరోవైపు ఇండోనేసియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన మత ప్రచారకులు రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి ఆజ్యం పోశారు. మొత్తం 10 మంది బృందం సభ్యులకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. దీనికితోడు యూరోప్, దుబాయ్, గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన పౌరులు కూడా ఈ వైరస్‌ బారిన పడటంతో కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలోకి చేరింది. ఈ పరిణామాలను అంచనా వేసిన కేంద్ర సర్కారు.. మార్చి రెండో వారంలో చైనా, హంకాంగ్, సింగపూర్, ఖతర్, ఒమన్, కువైట్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, ఇటలీ దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసింది.

యూరోప్, దుబాయ్‌లో కరోనా విజృంభించడంతో ఆ దేశాలకు కూడా గత 18 నుంచి విమానాల రాకపోకలను నిలిపివేసింది. అయినా ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ విస్తృతి పెరగడంతో అంతర్జాతీయ సరిహద్దులు మూసేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 22 నుంచి అన్ని దేశాల నుంచి విమాన రాకపోకలను నిలిపివేసింది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం జనతా కర్ఫ్యూ నిర్వహించిన ప్రభుత్వం.. ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రాన్ని లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. చరిత్రలో మునుపెన్నడూలేని విధంగా అన్నింటిని మూసివేసిన కేంద్ర సర్కారు.. తాజాగా దేశీయ విమాన సేవలను కూడా రద్దు చేసింది. 

మరిన్ని వార్తలు