జీ ‘హుజూర్‌’.. ఎవరో?

2 Jun, 2019 02:07 IST|Sakshi

హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి రేపు ఉత్తమ్‌ రాజీనామా

కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన టీపీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించనున్నారు. ఎంపీగా ఎన్నికైన నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలసి హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇవ్వనున్నారు. ఆయన రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. దీంతో హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి గా ఉత్తమ్‌ స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది.  

సతీమణే వారసురాలా..?
ఉత్తమ్‌ రాజీనామా అనివార్యం కావడంతో ఆ స్థానం ఏర్పాటైన నాటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్‌ వారసత్వం ఎవరికి వస్తుందన్నది నియోజకవర్గంలోనూ, రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. నియోజకవర్గవ్యాప్తంగా గట్టి కేడర్, అనుచరులున్న ఉత్తమ్‌ స్థానంలో ఎవరికి అవకాశం వస్తుందన్న దానిపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈసారి అక్కడి నుంచి కోదాడ మాజీ ఎమ్మెల్యే, ఉత్తమ్‌ సతీమణి పద్మావతిరెడ్డి బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఆమెకు కూడా నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలున్నాయి.టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ బిజీగా ఉంటే నియోజకవర్గంలో ఆమె పర్యటించి ప్రజాసమస్యల్ని పరిష్కరిస్తుంటారు.

నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోని నేతలను ఆమె గుర్తుపట్టి పలకరించగలిగేంత సంబంధాలున్నాయి. అయితే, ఈ దఫా పోటీకి ఆమె ఆసక్తిగా లేరని తెలుస్తోంది. తనకూ ఓ నియోజకవర్గం ఉన్నందున దాన్ని వదులుకుని భర్త ప్రాతినిధ్యం వహించిన స్థానానికి వెళ్లడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులొస్తాయనే ఆలోచనతో ఆమె పోటీకి నిరాకరిస్తున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో పద్మావతి కోదాడలో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయినా నల్లగొండ లోక్‌సభ ఎన్నికల్లో తన భర్తకు మంచి మెజార్టీ సాధించిపెట్టారు. హుజూర్‌నగర్‌ నుంచి ఆమె పోటీ చేయబోరని ఉత్తమ్‌ కుటుంబ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.  

మరి ఎవరు..?
ఉత్తమ్‌ పద్మావతి ఉప ఎన్నిక బరిలో లేకపోతే ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గ నేతలకే చాన్సిస్తారా...లేక జిల్లాకు చెందిన బిగ్‌షాట్స్‌ను ఎవరినయినా తీసుకువస్తారా.. అన్నది ఇప్పుడు హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌ అయింది. ఉత్తమ్‌ కూడా దీనిపై సీరియస్‌గా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. కొత్తవారిని బరిలో దింపాల్సి వస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై ఆయన అంతర్గతంగా లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

దేశంలో చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచారని, ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు జరగాలంటే కనీసం మూడు, నాలుగు నెలల సమయం ఉన్నందున ఉత్తమ్‌కు ప్రత్యామ్నాయం ఎవరనే విషయం ఇంకా చర్చకు రాలేదని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. కాంగ్రెస్‌కు కంచుకోట కావడంతోపాటు టీపీసీసీ చీఫ్‌ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపుతామని అంటున్నాయి. ఈ నేపథ్యంలో పద్మావతి చివరకు పోటీకి ఒప్పుకుంటారా... ఉత్తమ్‌ వారసత్వాన్ని కొత్త నేతలు తీసుకుంటారా.. అన్నది ఉపఎన్నిక నోటిఫికేషన్‌ తర్వాతే తేలనుంది.

మరిన్ని వార్తలు