ఇదేమి ట్విస్ట్ అధ్యక్షా!

3 Feb, 2015 12:08 IST|Sakshi
ఇదేమి ట్విస్ట్ అధ్యక్షా!

ఎంతైనా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రూటే సపరేట్. ఇప్పుడు ఆయన చూపంతా ఎమ్మెల్సీ సీటుపైనే ఉంది. పీసీసీ అధ్యక్షుడేంటి ఆయనకు ఎమ్మెల్సీ సీటేంటని అనుకుంటున్నారా. అక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ .. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారాన్ని 'హస్త'గతం చేసుకోలేదంటే అందుకు ముఖ్య కారణం పొన్నాలే అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలే బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

అంతేకాకుండా సదరు నేతలంతా అధిష్టానం వద్దకు చేరి.... తప్పంతా ఆయనదే అని పొన్నాల వైపు చూపిస్తున్నారని సమాచారం. ఆ విషయం పొన్నాలకు చేరటంతో ... పదవి గండం ముంచుకొచ్చే సమయం అసన్నమైందని ముందు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటే మంచిదన్న రీతిలో పొన్నాల వ్యూహారచన చేస్తున్నారు.  

తనను పీసీసీ అధక్ష్య పదవి నుంచి తప్పించాలని భావిస్తే... ఇప్పుడప్పుడే ఎన్నికలు లేవు. కాబట్టి ఏదో ఓ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని అధిష్టానానికి పొన్నాల షరతు విధించారని సమాచారం. అయితే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని పొన్నాల శుక్రవారం హైదరాబాద్లో తెలిపారు.

కానీ ఆ ఎన్నికల్లో రంగంలోకి దిగే అభ్యర్థులు ఎవరనేది మాత్రం అధిష్టానం నిర్ణయిస్తుందని సెలవిచ్చారు. అయితే ఎమ్మెల్సీ సీటు కావాలని హైకమాండ్ను తాను అడగలేదని పొన్నాల స్పష్టం చేశారు. అలాగే గతంలో తాను అడగకపోయినా అధిష్టానం పెద్దలు పిలిచి మరీ అధ్యక్ష పదవి ఇచ్చి పీసీసీ పీఠం ఎక్కించారని ఆయన గుర్తు చేశారు. తన మనసు మాత్రం ఎమ్మెల్సీ సీటుపై లగ్నమైందని పొన్నాల చెప్పకనే చెబుతూ కొత్త ట్విస్ట్ ఇచ్చేశారు.

మరిన్ని వార్తలు