నెట్టింటి వెరైటీ స్టార్స్‌..!

20 Dec, 2019 11:11 IST|Sakshi
రాయల్‌, వినయ్‌, కల్యాణ్‌

వైవిధ్యభరిత వీడియోలపై సిటీ యూత్‌ దృష్టి 

హాబీగా ప్రారంభించి నెట్‌లో హిట్టవుతున్న వైనం 

ప్రత్యేక శైలి ఏర్పర్చుకుంటూ విజయాల పయనం

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం యువతని ఉర్రూతలూ గిస్తున్న అధునాతన వేదిక సోషల్‌ మీడియా. ఇది కోట్లాది మందికి వినోదాన్ని విజ్ఞానాన్ని పంచుతుంటే.. వేలాది మందికి ఉపాధిగానూ మారుతోంది. ఈ నేపథ్యంలో సిటీ యువత తమలోని ప్రతిభకు సానబెడుతూ సోషల్‌ మీడియా వేదికగా విజయాలు సాధిస్తున్నారు. యూట్యూబ్, టిక్‌ టాక్‌.. ఇలా ఏదైనా సరే తమకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్‌ను క్రియేట్‌ చేసుకుంటూ లక్షలాది ఫాలోవర్లుగా మార్చుకుంటూ సోషల్‌ మీడియా స్టార్స్‌గా నిలుస్తున్నారు.  

ఫ్రాంక్‌గా.. 
తన యూట్యూబ్‌ చానల్‌లో 5 లక్షలకుపైగా అభిమానులతో వినోదాన్ని మేళవించి సందేశాత్మక వీడియోలతో స్టార్‌గా నిలిచాడు దిల్‌సుఖ్‌నగర్‌ వాసి వినయ్‌. అకస్మాత్తుగా ఎదురై అల్లరి పెట్టే ఫ్రాంక్‌ వీడియోలకు ఈయన ఫేమస్‌. 200కు పైగా ఫ్రాంక్‌ వీడియోలతో పాపులరై లక్షలాదిగా వ్యూస్‌ని కొల్లగొట్టాడు. సందేశాత్మకంగానూ, వినోదాత్మకంగానూ ఉండేలా కనీసం వారానికి 2 వీడియోలు చేస్తుంటాడు. యూట్యూబ్‌ ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగం అనాథ బాలలకు, చారిటీలకు  అందిస్తుంటానని ఆయన చెప్పాడు. ప్రస్తుతం ఒక టెలివిజన్‌ చానల్‌లో క్రియేటివ్‌ డడైరెక్టర్‌గా పని చేస్తూన్న ఆయన తన వీడియోస్‌కి వచ్చిన కామెంట్లలోని సూచనల ఆధారంగా తదుపరి ఫ్రాంక్స్‌ ప్లాన్‌ చేస్తుంటాడు.  

లాఫ్‌.. రాయల్‌ 
నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు నగరవాసి రాయల్‌ శ్రీ. హాస్య ప్రధానమైన డబ్‌స్మాష్‌లు, టిక్‌టాక్‌లు చేస్తూ తన ఫన్నీ గెటప్‌లతో క్రేజ్‌ తెచ్చుకున్నాడు. నాలుగో తరగతి మాత్రమే చదువుకున్నానని చెప్పే రాయల్‌.. అన్ని తరగతుల అన్ని వర్గాల మెప్పునూ పొందుతున్నాడు.  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూనే యూట్యూబ్‌ చానల్‌లో వైరల్‌ అవుతున్నాడు. ఆరోగ్యకరమైన హాస్యం, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండటంతో తనకు చాలా మంది అభిమానులుగా మారారని,  నవ్వటం ఒక యోగం, అందరినీ నవ్వించగలగడం తన దృష్టం అని అంటున్నాడు రాయల్‌ శ్రీ.  

సంగీతాన్ని వండుతూ...
ఆనందంగా తింటే ఆరోగ్యంగా ఉంటాం అన్నట్టుగా.. నవ్వుతూ తుళ్లుతూ వంట చేస్తూ ఆయన రూపొందించే టిక్‌టాక్‌ వీడియోలు విశేషాదరణ పొందాయి. ఆహారాన్ని ఆస్వాదిస్తే అదో వినూత్న అనుభూతి అని చెప్పకనే చెబుతూ, అసలు తినడానికి కూడా ఒక అర్హత ఉండాలి అంటాడు సైనిక్‌పురిలో నివసించే కల్యాణ్‌ నాయక్‌. తన వీడియోల ద్వారా తనకంటూ ఒక స్టైల్‌ని ఏర్పరచుకున్నాడు. ప్రకృతి ప్రేమికుడు కావడం వల్లనేమో ఆయన వీడియోల్లో సహజత్వం ఉట్టిపడుతుంది. ఒక్కమాటలో జీవితమంటే ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్, ఆర్ట్‌ ఆఫ్‌ కేరింగ్‌ అంటున్నాడు. తను మ్యూజిక్‌ కంపోజ్‌ చేసిన పిల్లా పిలగాడు ఆల్బమ్‌ వైరల్‌గా మారి ఏకంగా 5.4 మిలియన్స్‌ హ్యాష్‌ట్యాగ్స్‌ని సొంతం చేసుకుంది. ఉత్తరాది నుంచి కూడా పెద్ద సంఖ్యలో హ్యాష్‌ట్యాగ్స్‌  పొందడం విశేషం. ‘దీని ద్వారా వచ్చిన ప్రాచుర్యం 4 సినిమాలకు సంగీత దర్శకునిగా అవకాశాలను తెచ్చిపెట్టింది’ అని కల్యాణ్‌ నాయక్‌ చెప్పాడు. బీటెక్‌ పూర్తి చేసి ఇంట్లో వాళ్లు ఉద్యోగం చేయమని పోరుతున్నా వినకుండా.. ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్‌ మ్యూజిక్‌ ఇనిస్టిట్యూట్‌లో సంగీతం నేర్చుకున్నానని వివరించాడు.   

మరిన్ని వార్తలు